YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కుయ్యో రొయ్య

కుయ్యో రొయ్య

రాష్ట్రంలో కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సుమారు అయిదు లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగుచేస్తున్నారు. ఈ సాగు ఏటికేడు విస్తరిస్తోంది.  ఏటా 20 శాతం అభివృద్ధితో దూసుకుపోతోంది. ముఖ్యంగా మూడు నెలల్లో పంట.. రూ.లక్షల్లో లాభాలను చూసి పెద్దఎత్తున చిన్న, సన్నకారు రైతులు కూడా రొయ్యల సాగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈసారి రొయ్యల సాగులో చోటుచేసుకున్న సంఘటనలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైట్‌స్పాట్‌ వ్యాధి సోకినా, సరకు తక్కువగా ఉన్నా.. ధరలు నేలచూపులను చూడడంతో తీవ్రస్థాయితో నష్టాలు తప్పలేదు. ఎగుమతిదారులు సిండికేటుగా మారి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మార్కెట్‌ను చేతుల్లోకి తీసుకున్నారు.

భీమవరం మార్కెట్‌ నెల్లూరుతో పోల్చుకుంటే ఎప్పుడూ కేజీకి రూ.30 తక్కువగానే ఉంటుంది. 

రాష్ట్ర రొయ్యల రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టి రైతులు సాగుచేస్తుంటే పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్‌ను సిండికేటు శాసిస్తోంది. ఒక్కసారిగా పెద్దఎత్తున సరకు మార్కెట్‌కు వస్తే అంతర్జాతీయ  మార్కెట్లతో సంబంధం లేకుండానే వెంటనే ధరలు తగ్గిపోతుంటాయి. ఆసలే పచ్చి సరకు గంటల్లోనే మార్కెట్‌ చేసుకోవాలని రైతులు దళారులు చెప్పిన ధరకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అంతా నష్టపోవడం కంటే వచ్చినదానితో సంతృప్తి చెందుతున్నారు. ఆక్వారంగం రెండంకెల అభివృద్ధి రేటును సాధిస్తున్నా రైతులకు మాత్రం కష్టనష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం తెల్లమచ్చల వ్యాధి, రన్నింగ్‌ మెట్రాలటీ, తీవ్రస్థాయిలో ధరల పతనంతో ఎన్నో ఒడిదొడుకులతో వనామీ రొయ్యల సాగు చిన్న, సన్నకారు రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది.

మరోపక్క మేతలు, మందులు, డీజిల్‌, యంత్రాల ధరలు, చెరువుల లీజులు పెరిగిపోవడం రొయ్యల రైతులకు మింగుడు పడడం లేదు. అప్పులు తెచ్చి రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్న రైతులకు అన్నీ సవ్యంగా ఉండి పంట చేతికి వచ్చినా.. ప్రయోజనం ఉండడం లేదు. రొయ్యల ధరల తగ్గింపు, పెరిగిన ముడి సరకుల ధరల రూపంలో సాగులో లాభం వెళ్లిపోవడంతో రైతుకు అనుకున్న స్థాయిలో న్యాయం జరగడం లేదు. ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకుంటే మూడు పంటల్లో లాటరీ రూపంలో ఒకటి మాత్రమే చేతికి వస్తుంది. అప్పుడు రైతులకు న్యాయం జరగకుంటే ఎలా సాగుచేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

దేశంలో రైతులు పండించిన రొయ్యలను ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు. రొయ్యల మార్కెటింగ్‌ అంతా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లోనే ఉంది. కొనుగోలు చేసే కంపెనీలన్ని సిండికేటుగా మారి ఈసారి రొయ్యల ధరలను అజమాయిషీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రొయ్యల ధరలకు తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా రొయ్యల ధరల్లో ఏమార్పు లేకున్నా స్థానికంగా భారీగా తగ్గించేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మన రాష్ట్రంలోనే నెల్లూరు, కాకినాడ మార్కెట్లు నామమాత్రంగా రొయ్యల ధరలకు తగ్గిస్తే భీమవరం మార్కెట్‌ మాత్రం భారీగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌కు, రైతులకు ఇచ్చే ధరలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంటోంది. ప్రస్తుతం ఎగుమతుల ఆర్డర్లు లేవని, ఎక్కువగా వినియోగించే అమెరికా, యూరప్‌ దేశాల్లో దిగుమతి సుంకాన్ని భారీస్థాయిలో పెంచేశారని ఎగుమతిదారులు వాపోతున్నారు. పరోక్షంగా రొయ్యల ధరలు తగ్గించాల్సి వచ్చినట్లు వివరించారు.

రొయ్యల సాగులో ప్రస్తుతం ముడిసరకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డీజిల్‌ ధర ఆరునెలల కిందట రూ.62.50 ఉంటే ప్రస్తుతం రూ.71.50కు  చేరింది.  గతేడాది 25 పైసలుగా ఉన్న పిల్ల ధర ప్రస్తుతం రెట్టింపయింది. 25 కేజీల మేత బస్తా ధర రూ.100 పైగా పెరిగింది. జీఎస్టీతో రొయ్యలకు వాడే మందుల ధరలు కూడా పెరిగిపోయాయి. సాగు విస్తీర్ణం రెండింతలైంది. రొయ్యల ధరలు మాత్రం ఆ స్థాయిలో పెరగకపోవడంతో మంచి కౌంట్‌ పట్టినా లాభాలు మాత్రం రావడం లేదు.

వేలకోట్ల పెట్టుబడి..రెండంకెల అభివృద్ధి రేటు.. రాష్ట్రానికి అత్యంత ఆదాయాన్ని గడిస్తున్న రంగం ఆక్వాయే.. దీనిపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేకపోవడంతో రైతులకు కష్టనష్టాలు తప్పడం లేదు. రొయ్య పిల్ల తయారీ నుంచి, మందులు, మేతలలో నకిలీలు రైతులను పాతాళానికి తొక్కేస్తున్నాయి. కంటికి రెప్పలా నిద్రాహారాలు మాని పంటను రక్షించుకున్నా సిండికేటు మాయవుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోవడం తప్పడం లేదు. అంతర్జాతీయంగా ఎటువంటి ఇబ్బందులు లేని సమయాల్లో కూడా రైతులకు దక్కాల్సిన లాభాల్ని ఒక్కసారిగా రొయ్యల రేటు తగ్గించి దళారులు తన్నుకు పోతున్నారు. రైతులకు న్యాయం జరగాలంటే తప్పక ఈ రంగంపై ప్రభుత్వ అజమాయిషీ పెరగడమొక్కటే మార్గమని రైతులు కోరుతున్నారు.

Related Posts