మడ అడవులు మాయం..?
కాకినాడ, మే 13,
ఏపీ ప్రభుత్వం ఇప్పుడు.. ఏమైనా చేయనీ పేదవాళ్లకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అనిపించుకోవాలి. అందుకోసం ఇక్కడా అక్కడా అని లేకుండా ఎక్కడైనా భూములను స్వాధీనం చేసుకుంటుందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూములలో ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ పెద్ద దుమారం రేగుతుండగానే ఏకంగా కాకినాడ సముద్ర తీరానికి రక్షణ కవచంగా ఉండే మడ అడవులకు ఎసరు పెట్టారని తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం సబ్ డివిజన్ పరిధిలో గల ఆవ భూములను కొందరు అధికార పార్టీ నేతలు చేతుల్లోకి తీసుకొని ఆ భూములను ఇళ్ల స్థలాలుగా గుర్తించేలా రెవెన్యూ శాఖను కూడా తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారని ఆ ప్రాంత ప్రజలు మీడియా ముఖంగా గగ్గోలు పెడుతున్నారు. ఈ లోతట్టు ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ.. ఇళ్ల నిర్మాణం చేపడితే ఈ ప్రాంతం మునగడంతో పాటు పైనున్న గ్రామాలకు వరద నీరు పోటెత్తడం ఖాయమంటున్నారు.రాజమండ్రి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగానే కాకినాడ పరిధిలోని మడ అడవులలో ఇళ్ల స్థలాల పంపిణీ వివాదం మొదలైంది. కాకినాడ సముద్ర తీరానికి రక్షణగా ప్రకృతి ప్రసాదించిన వరం ఈ అడవులు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అడవుల జోలికి వెళ్ళలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏకంగా అడవులలో వంద ఎకరాలను నరికి అక్కడ ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని సన్నాహాలు చేస్తుంది.ఇప్పటికే మడ అడవులలో భాగమైన సర్వే నంబరు 376, 375/1లో వంద ఎకరాలను చదును చేసేందుకు యంత్రాంగం సిద్ధం చేసి కొంతమేర అడవులను కూడా నరికేశారు. ఈ వ్యవహారంపై అటు పర్యావరణ వేత్తల నుండి మత్స్యకారుల వరకు అందరూ ఆందోళన వెలిబుచ్చడంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు.తక్షణమే స్పందించిన ఎన్జీటీ అడవుల నరికివేత ఆపాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసిన ఎన్జీటీ ఎంతమేర అడవులను నరికివేసారో.. తిరిగి అడవుల పునరుద్దరణకు ఎంతమేర ఖర్చవుతుందో నివేదిక ఇవ్వాలని ఆ సొమ్మును కూడా ప్రభుత్వం ద్వారానే రాబట్టాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఈ వ్యవహారం పిటిషన్ల రూపంలో హైకోర్టుకు కూడా చేరింది.అయితే.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ తాను చేసేది పేదవారి కోసమని వితండవాదం చేయడం విశేషం కాగా.. తాము నరికేస్తుంది అసలు మడ అడవులు కాదని వాదిస్తుంది. కాకినాడ సమీపంలోని కోరంగి వద్ద సహజసిధ్ధంగా ఏర్పడిన ఈ మడ అడవులు ఒకవిధంగా కాకినాడ తీరానికి ఆయువు. తుఫానులు, వరదల నుండి తీరాన్ని కోతకు గురికాకుండా ఈ అడవులు కాపాడుతున్నాయి.ఇప్పటికే నాటుసారా తయారీదారులు, కలప దొంగలు, రొయ్యలు, చేపల పెంపకం కోసం కూడా మడులు ఏర్పాటు చేసుకునేందుకు అడవులను నరికివేస్తున్నారు. వారి నుండి ఆ అడవులను కాపాడి ప్రసిద్ధ కాకినాడ తీరంతో పాటు కాకినాడ నగరాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఇళ్ల స్థలాల పేరుతో ఆ అడవులకు ఎసరు పెట్టేసింది. నిజంగా పేదవారికి ఇళ్లస్థలాలు ఇచ్చి.. వారికి గూడు కల్పించే చిత్తశుద్ధి ఉంటె రాజధాని అమరావతి లాంటి వివాదాస్పద అంశాలు.. వానకి మునిగిపోయే ఆవ భూములు, ప్రకృతివరమైన మడ అడవుల జోలికి వెళ్లకపోవడమే మంచింది.రాష్ట్రంలో నివాసయోగ్యమైన వేలఎకరాల ప్రభుత్వం భూములున్నాయి. కాదు కూడదు అంటే పేద ప్రజలపై అంత ప్రేమే ఉంటె ప్రైవేట్ వ్యక్తుల నుండి భూములను కొనుగోలు చేసి కూడా పేదలకు పంచిపెట్టవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం పేదలకు ఇచ్చే భూములలో కూడా రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాల అభిప్రాయం