వైసీపీలో కనిపించని రీల్ లీడర్స్
విజయవాడ, మే 13
అందుకే వాటిని తళుకు బెళుకు అన్నారు. అవి ఎప్పటికైనా కరుగుతాయి. ఇంద్రధనస్సులా మెరిసి మురిపించినంతసేపు పట్టదు, వెలుగులు మలగిపోవడానికి. సినిమా తారలూ అంతే అనుకోవాలి. వారి మద్దతు కూడా అలాంటిదే. మొదటి నుంచి చూసుకుంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశానికే సినీ మద్దతు ఎక్కువ. అవును మరి, ఆ పార్టీని పెట్టిందే సినీ రంగంలో భీష్మాచార్యుడు లాంటి నందమూరి తారకరామారావు. ఆయనతో పాటే ఆనాడు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం జెండాకి జై కొట్టారు. ఆ పరంపర చంద్రబాబు జమానాలోనూ కొనసాగింది. ఇక ఇపుడు రాష్ట్రం రెండు ముక్కలయ్యాక తెలంగాణాలో సినీ పరిశ్రమ స్థిరపడడంతో చిత్రంగా టీఆర్ఎస్ కి కూడా సినీ మద్దతు నూటికి నూరు శాతం ఉంది. ఇక కాంగ్రెస్ కి తెలుగు సీమలో సినీ మద్దతు చాలా తక్కువ. ఆ వారసత్వంగా వచ్చిన వైసీపీలోనూ అదే ఒరవడి సాగుతోంది.అయితే వైసీపీ విషయంలో ఒక దశలో సినీ మద్దతు బాగా ఉన్నట్లు కనిపించింది. జగన్ ప్రతిపక్ష నేతగా జనంలో తిరుగుతూంటే వైసీపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని భావించిన సినీ జీవులు చాలా మంది ఫ్యాన్ నీడకు చేరారు. అలా వచ్చిన వారిని జగన్ కూడా సమాదరించారు. ఈ రకంగా చూసుకుంటే వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న రోజా రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆమెకు పార్టీలో, ప్రభుత్వంలో కూడా కేలకమైన పాత్ర ఉంది.ఇక టాలీవుడ్ నుంచి జగన్ కి పెద్దగా మద్దతు లేని రోజుల్లో కమెడియన్ గా మంచి ఫాంలో ఉన్న థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీ వచ్చి జగన్ కొమ్ము కాశారు. జగన్ సైతం ఆయన్ని సమాదరించారు. ఆ తరువాత వైసీపీలో ఆయనకు కీలకమైన పాత్ర కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వెంకట్వేశ్వర భక్తి చానల్ కి చైర్మన్ ని చేశారు. దీంతో ప్రుధ్వీ రేంజి పెరిగింది. అయితే ఆయన చేసిన కొన్ని తప్పుల వల్ల ఆ పదవిని తానే స్వయంగా పోగొట్టుకున్నారు. ఆయన ఎపిసోడ్ తో జగన్ కి కూడా సినిమా వారి మీద కొంత నమ్మకం తగ్గినట్లుగా చెబుతారుఇక వైసీపీలో మొదట చేరింది సినీ జంట జీవితా, రాజశేఖర్. అదే విధంగా తరువాత కాలంలో పోసాని క్రిష్ణ మురళి, భాను చందర్, సినీ హీరో రాజా, గిరిబాబు, జయసుధ, రఘుబాబు వంటి వారున్నారు. ఇక మోహన్ బాబు ప్రత్యేకంగా జగన్ కోసం వచ్చి మరీ చేరి కండువా కప్పుకున్నారు. అదే విధంగా మేటి కమెడియన్ ఆలీ కూడా జగన్ పార్టీలో చేరి ప్రచారం చేశారు. ఇక ఒకప్పటి డైరెక్టర్ క్రిష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి వంటి వారు కూడా పాదయాత్రలో జగన్ ని కలసి మద్దతు ఇచ్చారు. ఇలా ఇంతమంది సినిమా పరిశ్రమ నుంచి మద్దతుగా ఉండడంతో ఓ దశలో వైసీపీ అంటే టాలీవుడ్ అన్న మాట కూడా వినిపించింది. మరో వైపు టాప్ హీరో నాగార్జున కూడా జగన్ తో సన్నిహితంగా మెలిగారు.ఇపుడు చూస్తే వీరిలో ఎవరూ కూడా వైసీపీ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. ఏపీ కష్టంలో ఉన్నపుడు పెదవి విప్పడంలేదు. దీని బట్టి వారు ఎందుకు వైసీపీలో చేరారు. ఏమాశించి వచ్చారు అన్నది ఒక చర్చ. ఇంకో వైపు చూస్తే వారిని చేర్చుకుని వైసీపీ ఏం బావుకుందని కూడా ప్రశ్నగా ఉంది. మొత్తం మీద సినిమా గ్లామర్ చూసుకుంటే ఇప్పటికైతే వైసీపీలో నిల్ అని చెప్పాలి. మొదటి నుంచి ఉన్న రోజాతో పాటు, విజయచందర్ వంటి ఒకరిద్దరే నికరం అనుకోవాలేమో. ఏది ఏమైనా మా నాయకుడు జగనే పెద్ద హీరో, ఆయనకు వేరే తారల తళుకులు ఎందుకు అన్నది ఇపుడు వైసీపీలో వినిపిస్తున్న మాట.