YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దరిచేరని లక్ష్యం

దరిచేరని లక్ష్యం

 గ్రామీణ ఉపాధి కల్పనలో జిల్లా చతికిలపడింది. ఏ ఒక్క అంశంలోనూ ప్రథమ స్థానంలో నిలవలేదు. నిధుల వ్యయం... పని దినాల కల్పన.. కనీస వేతనం... కుటుంబాలకు వంద రోజుల పని దినాలు.. ఇలా అన్నింటిలోనూ రాష్ట్రంలోనే జిల్లా ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2.18 కోట్ల పని దినాలు కల్పించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. మార్చి ఆఖరు నాటికి 1.78 కోట్లు పని దినాలు నమోదు అయ్యాయి. అంటే.. ఇంకా 40 లక్షల పని దినాలు మిగిలి పోయాయి. నిధుల వ్యయంలో చూస్తే.... రూ.538.04 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో కూలీల వేతనాలకు రూ.297.96 కోట్లు, మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద రూ.209.26 కోట్లు,  కంటింజెంటీ కింద రూ.30.82 కోట్ల మేర వ్యయమైంది.

తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల తర్వాతే అనంత నిలిచింది. పని దినాల నమోదులోనూ ఐదో స్థానమే. విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి తర్వాత అనంత ఉంది. కుటుంబానికి వంద రోజుల పని దినాల కల్పనలో జిల్లా నాలుగో స్థానంలో ఉంది. క్రమంగా ఉపాధి పనికి వెళ్తున్న కుటుంబాలు జిల్లాలో 2.95 లక్షలు ఉన్నాయి. వీటిలో 61,955  కుటుంబాలు మాత్రమే వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్నాయి. కనీస వేతనంలో మాత్రం మూడో స్థానంలో ఉంది. చిత్తూరులో రూ.168.58, తూర్పు గోదావరిలో రూ.166.85, మన జిల్లాలో రూ.166.74 ప్రకారం కనీస వేతనం లభించింది.

జిల్లాలో మండలాల పరిస్థితిని చూస్తే అన్నింటిలోనూ ముదిగుబ్బ ప్రథమ స్థానంలో నిలిచింది. హిందూపురం అధ్వానంగా ఉంది. మొత్తం రూ.538.04 కోట్లు ఖర్చు చేస్తే... ఇందులో ఒక్క ముదిగుబ్బలోనే రూ.17.62 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత స్థానాల్లో ఆత్మకూరులో రూ.14.18 కోట్లు, నార్పలలో రూ.13.04 కోట్లు, కనగానపల్లిలో రూ.12.54 కోట్లు, సీకేపల్లిలో రూ.12.47 కోట్లు మేర వ్యయం చేశారు. తక్కువ విషయానికి వస్తే... హిందూపురంలో కేవలం రూ.3.98 కోట్లు, లేపాక్షిలో రూ.4.02 కోట్లు, అగళిలో రూ.4.54 కోట్లు, రొళ్లలో రూ.4.62 కోట్లు, అమరాపురంలో రూ.5.01 కోట్లు ప్రకారం వెనుకపడ్డాయి. ఇక జిల్లా అంతట 1.78 కోట్ల పని దినాల నమోదులో... ముదిగుబ్బలోనే 5.62 లక్షలు, శింగనమలలో 5.03 లక్షలు, నార్పలలో 4.82 లక్షలు, యల్లనూరులో 4.45 లక్షలు, కనగానపల్లిలో 4.23 లక్షల ప్రకారం పని దినాలు నమోదయ్యాయి. తక్కువగా నమోదై వెనుకపడిన మండలాలను పరిశీలిస్తే... హిందూపురంలో కేవలం 65 వేలు మాత్రమే పని దినాలు కల్పించారు. ఆ తర్వాత స్థానాల్లో రొళ్లలో 1.43 లక్షలు, లేపాక్షిలో 1.5 లక్షలు, అగళిలో 1.55 లక్షలు, అమరాపురంలో 1.59 లక్షల ప్రకారం పనులు కల్పించారు.

ఉపాధి పథకంలో కనీస వేతనం ఒక్కో కూలీకి రోజుకు రూ.196 కేటాయించారు. ఈ ప్రకారం ఒక్క పెనుకొండలో మాత్రమే కనీస వేతనం కంటే ఎక్కువ లభించింది. ఇక ఏ మండలంలోనూ కనీస వేతనం దక్కలేదు. పెనుకొండలో ఎక్కువగా సగటున కూలీలకు రూ.205.19 ప్రకారం వేతనం వచ్చింది. జిల్లా స్థాయి సగటు వేతనం రూ.166.74 ప్రకారం ఉంది. దీని కంటే ఎక్కువ 34 మండలాల్లో వేతనం లభించింది. పెనుకొండ తర్వాత నల్లమాడలో రూ.187.35, అగళిలో రూ.184.6, తనకల్లులో రూ.184.4, ఆత్మకూరులో రూ.182.96 ప్రకారం కనీస వేతనం కూలీలకు చేరింది. మొత్తం 61,955 కుటుంబాలకు పూర్తిగా వంద రోజులు పని దినాలు కల్పించారు. వీటిలో ఎక్కువగా పెనుకొండలోనే 1,969 కుటుంబాలు, పుట్లూరులో 1,854, ముదిగుబ్బలో 1,832, శింగనమలలో 1821, రాయదుర్గంలో 1,757  కుటుంబాలు ప్రకారం వంద రోజులు పూర్తి చేసుకున్నారు. గతేడాది 73,048 కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసుకున్నాయి.

Related Posts