YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆస్పత్రికి దాహార్తి

 ఆస్పత్రికి దాహార్తి

 జిల్లాకేంద్ర ఆసుపత్రిలో నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీరు కూడా కరవైంది. ఉచితంగా సరఫరా చేసే పరిశుభ్రమైన నీటినీ కొద్ది రోజులుగా నిలిపివేశారు. రోగాల బాధ ఎలా ఉన్నా.. ఏటా ఆసుపత్రిలో దాహార్తి తప్పడం లేదు. రోజూ 4 లక్షల లీటర్ల నీరు సరఫరా అయితేనే నీటి సమస్య ఉండదు. కానీ, రెండ్రోజులకోసారి కార్పొరేషన్ నుంచి 3 లక్షల లీటర్ల నీరు ఇస్తున్నారు.. వేసవితో అది 2 లక్షలకు పడిపోయింది. తక్షణమే చర్యలు చేపట్టకపోతే రోగులు గొంతెండాల్సిన పరిస్థితి..

పెద్దాసుపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కరవైంది.. నగరపాలక సంస్థ నుంచి కంటితుడుపుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి వదిలేశారు. దీంతో ఏటా వేసవిలో సమస్య తీవ్రమవుతోంది. జిల్లా కేంద్రంలో పలు రకాల వైద్యం అందించడానికి ఓ వైపు 350 పడకల ఆసుపత్రి.. మరోవైపు కొత్తగా 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ రెండు ఆసుపత్రుల్లో నిత్యం నీటి సమస్య ఎదురవుతూనే ఉంది. ఏడు బోరుబావులు వేయగా మూడు ఎండిపోయాయి. మరో నాలుగు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. పాత బావి పనికి రాకుండా పోయింది.

జిల్లా ఆసుపత్రికి రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసే నగరపాలక సంస్థ కొన్ని రోజులుగా సరఫరాను తగ్గించడంతో రోగులు వారి బంధువులు బయట నుంచి వచ్చే అవుట్‌ రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో 350 పడకల ఆసుపత్రి, 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నాయి. వీటి కోసం మొత్తం 7 బోరుబావులు ఉండగా.. వాటిలో 3 ఎండిపోయాయి.. మిగిలిన 4 బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఫలితంగా రోజూ నీటి సరఫరా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న 11 నీటి రిజర్వాయర్లు, మాతా శిశు ఆరోగ్య కేంద్రంపై ఉన్న 8 రిజర్వాయర్లను రోజుకు మూడు సార్లు నింపితే 4 లక్షల లీటర్ల నీరు అందుబాటులో ఉంటుంది. కార్పొరేషన్ రోజు విడిచి రోజు సరఫరా చేసే 3 లక్షల లీటర్లతో పాటు ఆసుపత్రిలో అందుబాటులో ఉండే 4 బోరుబావుల సాయంతో లక్ష లీటర్ల నీటితో 19 రిజర్వాయర్లును నింపి రోగులకు సరఫరా చేయాలి. వారం రోజులుగా నగరపాలక సంస్థ సరఫరా తగ్గడంతో పాటు.. ఆసుపత్రికి నీరందిస్తున్న బోరుబావులు అడుగంటిపోవడంతో రోజుకు మూడుసార్లు నింపాల్సిన రిజర్వాయర్లును రెండుసార్లు మాత్రమే నింపుతున్నారు.

ఇక ప్రసవాలు, శస్త్రచికిత్సలతో రాష్ట్ర స్థాయిలోనే మెదటి స్థానంలో ఉన్న కరీంనగర్‌ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తాగునీటి ఎద్దడి తాండవిస్తోంది. రెండు రోజులపాటు చుక్క నీరు రాకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. 150 పడకలకు బదులు మరో 50 మంది అదనంగా వస్తారు. ఇక్కడి పరిస్థితిని తక్షణమే అంచనా వేయకపోతే ఎద్దడి మూలంగా ఆరోగ్య వాతావరణం నెలకొని ఉండాల్సిన ఆసుపత్రి అనారోగ్యంపాలై తల్లులు, పిల్లలు ఇతర వ్యాధుల భారినపడే ప్రమాదం ఉంది. ఈ ఆసుపత్రి పరిధిలో ఎనిమిది నీటి రిజర్వాయర్లు ఉన్నప్పటికీ నీటి సరఫరా లేక రోగులకు నీరు అందటం లేదు.. నిత్యం లక్ష లీటర్ల నీరు అవసరం.. కానీ రెండ్రోజులకోసారి సరఫరా చేసే నగరపాలక సంస్థ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది..

రోగులకు నిరంతరం కేవలం రూపాయికే లీటరు నీటిని అందించే విభాగం కూడా మూతపడింది. మరో ధర్మశాల సంస్థ కూడా ఉచితంగా శుద్ధజలాన్ని అందింస్తుండగా.. కొద్ది రోజులుగా బంద్‌ చేశారు. ఫలితంగా రోగులు అల్లాడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్‌లో లీటర్‌కు రూ.5 నుంచి 15 వరకు చెల్లించి తెచ్చుకుంటున్నారు. ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రతి రోగికి కనీసం 5 లీటర్ల నీరు అవసరం. ఆసుపత్రిలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాలు పనిచేయడం లేదు. నల్లా నీరు వచ్చినప్పుడే కొందరు నిల్వ చేసుకుంటున్నారు.

Related Posts