YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీకే పరిమితమవుతున్న మూడు పార్టీలు

ఏపీకే పరిమితమవుతున్న మూడు పార్టీలు

ఏపీకే పరిమితమవుతున్న మూడు పార్టీలు
విజయవాడ, మే 13
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు నాయ‌కులుగా ఉన్నా తెలంగాణ‌లోనూ త‌మ పార్టీ ఉండాల‌ని కోరుకుంటున్న టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన ఇప్పుడు మ‌న‌స్సు మార్చుకున్నట్లు క‌నిపిస్తోంది. తాము అంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌రిమిత‌మైతే చా‌లానే నిర్ణ‌యానికి వారు వ‌చ్చేసిన‌ట్లున్నారు. ఈ మూడు పార్టీల అధినేతల వైఖ‌రే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం.. అనే సినిమా డైలాగులు రాజ‌కీయాల్లో సెట్ అవ్వ‌వ‌ని వారు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అందుకే తెలంగాణ‌ను పూర్తిగా వ‌దిలేసి, ఆయా పార్టీల అధినేతలు త‌మ‌ దృష్టి మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీద‌నే పెట్టారు.
ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉండేది. తెలంగాణ‌లోనూ ఆ పార్టీకి ఊరూరా పార్టీ శ్రేణులు ఉండేవి. కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా టీడీపీ బ‌లంగా ఉండేది. అందుకే తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా తాప‌త్ర‌య‌ప‌డ్డారు. తెలంగాణ‌పై ఏ విష‌యాన్నీ తేల్చ‌లేక‌, రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందే తెలంగాణ‌లో టీడీపీ నాయ‌క‌త్వం ఖాళీ అవ‌డం మొద‌లైంది. ఉద్య‌మంలో పాల్గొనేందుకు టీటీడీపీ నేత‌లు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా 2014లో తెలంగాణ‌లో టీడీపీ కొంత బ‌లం నిరూపించుకుంది. 15 అసెంబ్లీ సీట్ల‌ను గెలుచుకుంది. ఏపీలో అధికారంలోకి కూడా రావ‌డంతో తెలంగాణ‌లోనూ పాగా వేయాల‌ని మ‌రింత ఉత్సాహంతో చంద్ర‌బాబు ముందుకెళ్లారు. కానీ, ఓటుకు నోటు కేసు, టీటీడీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు చాలా వ‌ర‌కు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవ‌డం, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి వంటి ప‌రిణామాలు చంద్ర‌బాబు వ్యూహాల‌కు అడ్డంకిగా మారాయి. అయినా 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి చంద్ర‌బాబు త‌న దృష్టి తెలంగాణ‌పై పెట్టి, ప్ర‌జాకూట‌మి ఏర్పాటు చేయించి, కేసీఆర్‌ను గ‌ద్దె దించే ప్ర‌య‌త్నం చేశారు.కానీ, అది కూడా విఫ‌లం కావ‌డం, కేసీఆర్‌, అధికారంలోకి రావ‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో చంద్ర‌బాబు అనుకున్న‌వి అన్నీ రివ‌ర్స్ అయ్యాయి. దీంతో తెలంగాణ గురించి ఆయ‌న పూర్తిగా వ‌దిలేశారు. గ‌తంలో ప్ర‌తి శ‌నివారం తెలంగాణకు స‌మ‌యం కేటాయిస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌కు ఇప్పుడు ఆ తీరిక కూడా లేదు.ఏపీలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకే ఆయ‌న‌కు స‌మ‌యం చాల‌డం లేదు. తెలంగాణ‌లోని రాజ‌కీయ ప‌రిణామాల గురించి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి ఆయ‌న ఒక్క‌సారి అంటే ఒక్క‌సారి కూడా స్పందించ‌డం లేదు. స్థానిక సంస్థ‌లు, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేయ‌లేదు. అయినా, ఎల్.ర‌మ‌ణ వంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి ఉన్నామా అంటే ఉన్నాము అనేలా అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తున్నారుఃఇక‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి తెలంగాణ‌లో అభిమానులు ఎక్కువ‌. వైసీపీ స్థాపించాక స‌మైక్య‌వాదిగా ముద్ర‌ప‌డినా చాలామంది నేత‌లు జ‌గ‌న్ వెంట న‌డిచారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న అనివార్యం కాగానే జ‌గ‌న్ త‌న దృష్టి మొత్తం ఏపీ పైనే పెట్టారు. తెలంగాణ‌ను మొద‌ట వ‌దులుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పార్టీ వైసీపీనే. ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణ‌లో పోటీ చేయ‌డం లేదు.పేరుకు తెలంగాణ‌కు శాఖ‌కు అధ్య‌క్షుడిగా గ‌ట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం రెట్టింపు చేయాల‌నే ఆలోచ‌న ద్వారా తెలంగాణ‌కు న‌ష్టం చేస్తున్నార‌ని జ‌గ‌న్‌పై తెలంగాణ పార్టీలు ఆరోపిస్తున్నాయి.జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ‌లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. 2014లో తెలంగాణ‌లో ఆయ‌న టీడీపీ, బీజేపీ కోసం ప్ర‌చారం చేశారు. తెలంగాణ‌కు 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీ కూడా చేసింది. టీడీపీ, వైసీపీతో పోల్చితే అడ‌పాద‌డ‌పా తెలంగాణ గురించి, అక్క‌డి ప్ర‌జాస‌మ‌స్య‌ల గురించి జ‌న‌సేన‌నే స్పందిస్తోంది.కానీ, ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా తెలంగాణ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. మొత్తంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నాయ‌క‌త్వం ఉన్న పార్టీలు తెలంగాణ‌ను పూర్తిగా వ‌దిలేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమిత‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

Related Posts