మద్యం మత్తులో తండ్రి హత్య
నాగర్ కర్నూలు మే 13
కట్టుకున్న భర్తను కొడుకుతో కలిసి దారుణంగా హతమార్చిన సంఘటన మరువకముందే బిజినపల్లి మండలం పోలేపల్లి లో మరో సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి పై దాడి చేసి గొడ్డలితో నరికి చంపిన కొడుకు ఉదంతం వెలుగు చూసింది. బిజినపల్లి మండలం పోలేపల్లి లో ఈ సంఘటన జరిగింది. పోలేపల్లికి చెందిన కావలి కురుమయ్య(57) తన కుమారుడు శ్రీనివాసులు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మద్యానికి బానిసైన కొడుకు తండ్రి పై కోపం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి తప్పతాగిన శ్రీనివాసులు తండ్రితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఆవేశానికి గురైన శ్రీనివాసులు ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని తండ్రి మెడపై నరికాడు .దీంతో తండ్రి కురుమయ్య ఒక్కసారిగా కుప్పకూలి రక్తపుమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.