YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

భూమెక్కడ..?

భూమెక్కడ..?

భూమి.. అటు అధికారులు ఇటు లబ్ధిదారుల్ని ఇబ్బందిపెడుతోంది. ఆయా గ్రామాల్లో అవసరమైన భూమి అందుబాటులో లేకపోవడం.. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగకపోవడం...తదితర కారణాలతో భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాలు పంపిణీ చేయడానికి ఆటంకాలు తప్పడం లేదు. గడిచిన రెండేళ్లలో సిద్దిపేట, మెదక్‌ జిల్లాలో పథకం అమలు సజావుగా సాగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలి రెండేళ్ల పాటు పథకం అమలులో ప్రగతి కనిపించింది. 2016-17, 2017-18లో మాత్రం అవసరమైన నిధులు మంజూరైనా క్షేత్రస్థాయిలో అధికారులు పథక ప్రయోజనాన్ని లబ్ధిదారుల దరి చేర్చలేకపోయారు. సిద్దిపేట జిల్లాలో గడిచిన రెండేళ్లలో 104 మందికి వందెకరాలకుపైబడి, మెదక్‌ జిల్లాలో 22 మందికి కేవలం 43 ఎకరాలే అందించగలిగారు. ఇది కూడా కొన్ని మండలాలకే పరిమితం చేశారు.

2014-15లో భూపంపిణీ పథకం ప్రారంభం కాగా... నాలుగేళ్లలో ఇరు జిల్లాల్లో మొత్తం 511 మందికి భూమి పంపిణీ చేశారు. ఇలా మొత్తం 1182 ఎకరాల 38 గుంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి దళితులకు అందించింది. ఇందుకోసం ఇరు జిల్లాల్లో సుమారు రూ.50 కోట్లు వెచ్చించారు. సిద్దిపేట జిల్లాలో రూ.31 కోట్లు వెచ్చించి 339 మందికి 808 ఎకరాల 31 గుంటలు పంపిణీ చేయగా... మెదక్‌ జిల్లాలో మాత్రం సుమారు రూ.19కోట్ల వ్యయంతో 374 ఎకరాల 7 గుంటలను 172 మందికి ఇచ్చారు. మెదక్‌ కన్నా సిద్దిపేట జిల్లాలో నాలుగు వందల ఎకరాలకు పైగా ఎక్కువ అందించారు.

చాలాగ్రామాల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమి దొరకడం కష్టసాధ్యమైన ప్రక్రియగా మారిందని అధికారులు చెబుతున్నారు. పైగా బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకేలా ఉండటం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని అంటున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సాగుయోగ్యమైన భూమి విక్రయించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం... గత ప్రభుత్వాల హయాంలో భూముల్ని నిరుపేదలకు అందించడం వల్ల ప్రస్తుతం ఊరూరా కొరత ఏర్పడుతోంది. కొన్ని ఊర్లలో భూమి అందుబాటులో ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడం, సాగుకు అంతగా ఉపయోగపడవని అధికారులు అంటున్నారు. సర్కారు ఎకరానికి అందించే ధర తక్కువగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.10-20 లక్షల వరకు ఆయా ప్రాంతాల్ని బట్టి ఉండటంతో ధరాఘాతం శరాఘాతంగానే మారుతోంది.

జిల్లాలో ఇప్పటివరకు కొనసాగిన పంపిణీ ప్రక్రియను పరిశీలిస్తే ఈపథకం కొన్ని మండలాలకే పరిమితమైనట్లు అవగతం అవుతుంది. అత్యధిక మండలాల్లో అమలు చేయాలని సర్కారు భావిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. మెదక్‌ జిల్లాలో మొత్తం 20 మండలాలలకు గాను ఇప్పటివరకు 8 మండలాల పరిధిలోని పలు గ్రామాల వారికే అందించారు. నిజాంపేట, రామాయంపేట, చిలప్‌చెడ్‌, చేగుంట, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లోని 172 మందికి లబ్ధి చేకూరింది. మిగతా 12 మండలాల్లో ఈ ఏడాదిలోనైనా పంపిణీ దిశగా అడుగులు పడాల్సి ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలోని పలు మండలాల్లో అధికారులు అనువైన భూముల్ని పరిశీలించారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో కొండపాక, సిద్దిపేట రూరల్‌, జగదేవ్‌పూర్‌, దౌల్తాబాద్‌, మిరుదొడ్డి, నంగునూరు, మర్కూక్‌, చిన్నకోడూరు, దుబ్బాక, గజ్వేల్‌, చేర్యాల, తొగుట, అక్కన్నపేట, హుస్నాబాద్‌, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో భూ పంపిణీ జరిగింది. మరో ఆరు మండలాల్లో అసలు పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏడాదిలో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Related Posts