YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

త్రిపురాంతక పుణ్యక్షేత్రం

త్రిపురాంతక పుణ్యక్షేత్రం

త్రిపురాంతక పుణ్యక్షేత్రం
*శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. భోళా శంకరుడైన శివుడు ఆశ్రిత జన రక్షకుడిగా తన పేరును సార్ధకం చేసుకున్నాడు.* *ఈ లోకంలోని సమస్తమైన పాపాలు,దుష్కర్మలు శివనామ స్మరణంతోనే మటుమాయమవుతాయని శివపురాణాలు చెప్తాయి.* *అలా శివుడు కొలువు దీరిన మరో అతి పురాతన దివ్యక్షేత్రమే త్రిపురాంతకం.* *శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం.* *త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువుదీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది.*  అలాంటి ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉంది. *శ్రీశైల ద్వారాలలో ప్రథమం, ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైలం క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది.* *శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్ఠాన దేవత అయిన బాలా త్రిపుర సుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది.* ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయం. కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతో పాటు ఘాట్‌రోడ్డు సదుపాయం ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో వందలకొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి. అతి పురాతన ఈ ఆలయ అభివృద్ధికి చోళ, రాష్టక్రూట, విజయనగర ప్రభువులు విశేషంగా కృషి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. *దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది.*
*పురాణగాథ:*
విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలత చెంది కైలాసం వీడాడని అంటారు. అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపంలో గల కొండపై తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థల పురాణ కథనం. దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరువచ్చినట్టు తెలుస్తుంది. *????ఆది దంపతులకు ప్రతిరూపం ఈ క్షేత్రం.* త్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడంవల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం. అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజ స్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయని భక్తుల నమ్మకం. *ఈ స్వామి దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం ..* త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడని అంటారు. ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వరస్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు. అణువణువు శివ నామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు. తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవాడు. ప్రతి పౌర్ణమి *నాడు పార్వతీ దేవి,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూడటానికి వస్తూ ఉండేవారని శివ పురాణంలోని ఈ శ్లోకం మనకు తెలియ జేస్తోంది –‘’* *అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’* ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు అలాంటి అరుదైన దేవాలయం ఇది. *’’శ్రీ చక్రం శివ యోర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం .* *స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట.అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి.* అమ్మవారు పార్వతీ మాత. ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. ఆలయంలో ఒక పక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది. దీనిని చీకటి గుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గంగుండానే వెళ్లేవారని ప్రతీతి. ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది. దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరుడుతోపాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. *త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాలా త్రిపుర సుందరి మాత ఆలయం ఉంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వరాలయం, పాపనాశనం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి.* వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది. ఉజ్జయిని, కోల్‌కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులు చెబుతారు. త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికి (విల్లు) త్రిపుర సుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమ గుండంలో, బాల త్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది. *పూర్వం ఈ ఆలయంలో వామాచార పద్ధతిలో పూజలు నిర్వహించేవారు. కానీ నేడు ఆ ఆచారం తెరమరుగైంది. అమ్మవారి ఆలయం అతి పురాతనమైనది.* ఈ అమ్మవారి ఆలయం త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి పూర్వం నాటిదిగా దీనిని చెబుతారు. అమ్మవారి ఆలయంలో ఓ పక్క దక్షిణామూర్తి కొలువుదీరారు. *గర్భాలయంలో ఉన్న అమ్మవారు నిరాకార శిల్పం. భక్తులకు చూసే భాగ్యం కలగదు. ఈ శిల్పానికి ముందు భాగంలో అమర్చిన త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహమే దర్శనమిస్తుంది.*  అలాగే గర్భాలయంలో గణపతి, వీరభద్రుని మూర్తులు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క చతుషష్టి యోగినీ మూర్తుల శిల్పాలున్నాయి. వీరంతా అమ్మవారి పరిచారికలని చెబుతారు. ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే .ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది .గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. *.’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు .* కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది .ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం . దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు అమ్మవారు ఉత్తరాభి ముఖంగా దర్శనమిస్తుంది .చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి .ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ .అదే నవావరణంలో బాలాత్రిపురసుందరి ఉంటుందన్నమాట. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది .సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికే చేస్తారు
*‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై*
*కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’* అని
తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు పద్యం చెప్పారు . చిదగ్ని కుండం నుంచి (గర్భగుడి నుండి) బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి .వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు .ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు. మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి.అర్చనలన్నీ వీటీకే చేస్తారు.అందరూ వీటిని పూజించవచ్చు. చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు . చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది . ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు .ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య . ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు . సాధారణం గా శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండు ఇక్కడ లేవు .కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు  వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత . ’’సవ్యాప సవ్య మార్గస్థా’’.ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది .అందుకే గర్భాలయంలో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది .*ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది .ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు .ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యంలో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది .దీనిపై సంస్కృత శాసనం ఉంది .శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు*
దీన్ని ఒక కవి పద్యంలో
*‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద –*
*మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’*
వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో-*‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ* *దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’* త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి .అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రంలో చెప్పారు . అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే .ఇవి భక్తుల వీర కృత్యాలకుప్రతి బింబాలు .ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది .ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో,గుండెలో,గొంతులో,తొడలలో పొడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు .వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి . ’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం .ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి .ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం. శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. *భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు, నూటికి పైగా జలాశయాలున్నాయని చెబుతారు.*  ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం వసంత నవరాత్రులు ,శరన్నవరాత్రులు శ్రావణ మాసం లోప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి. ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిఅమ్మవారిని, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.. ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును. 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts