గత 20 సంవత్సరాల్లో చైనా నుంచే సుమారు 5 మహమ్మారులు
వాషింగ్టన్ మే 13
గత 20 సంవత్సరాల్లో సుమారు 5 మహమ్మారులు చైనా నుంచే వచ్చాయని, దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రయాన్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మందిని పొట్టన పట్టుకున్న కరోనా మహమ్మారికి కూడా చైనాదే బాధ్యత అన్నారు. 'చైనా నుంచి వచ్చే ఈ మహమ్మారులను ఇక ఎంతమాత్రం భరించలేం' అని ప్రపంచ ప్రజలు ఉవ్వెత్తున లేచి చైనా ప్రభుత్వానికి ముక్తకంఠంతో తెలియజేస్తారని ఓ బ్రయాన్ మంగళవారం వైట్‌హౌస్‌లో విలేఖరులతో అన్నారు. 'వైరస్ వూహాన్ నుంచే వచ్చిందని మనకు తెలుసు.. ల్యాబు నుంచో, కబేళా నుంచో వచ్చి ఉంటుందనడానికి పరిస్థితులు ఊతమిస్తున్నాయి. కైనీ చైనాకు మాత్రం ఈ రెండు విషయాలు చెప్తే మంచిగా అనిపించవు' అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పేర్కొన్నారు. గత 20 ఏళ్లల్లో సార్స్, బర్డ్ ప్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా వంటి ఐదు మహమ్మారులు చైనా నుంచే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయితే ఆయన ఐదో మహమ్మారి ఏదో చెప్పలేదు. వైరస్ మూలం గురించిన ఆధారాలు ఎప్పటివరకు వెల్లడిస్తారు అనే ప్రశ్నకు గడువు ఏదీ చెప్పలేనని సమాధానమిచ్చారు.