కొత్త చట్టం తెస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.
ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టం పేరుతో నిబంధనల పేరుతో కాలయాపన చేయొద్దని హితవు పలికారు. వెంటనే బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బాధితుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని అన్నారు. బాధితులు ఎవరూ మానసిక ఒత్తిడికి గురి కావొద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల తరఫున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని ధైర్యం చెప్పారు.ప్రభుత్వ మెడలు వంచి ప్రతి రూపాయిని తిరిగి బాధితులకు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అన్నిజిల్లాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ పర్యటిస్తుందని వెల్లడించారు.అగ్రిగోల్డ్ సమస్యపై వైఎస్ జగన్ స్పందించిన ప్రతిసారీ ప్రభుత్వంలో కదలిక వస్తోందని చెప్పారు.అయితే, వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ సమస్యపై గళమెత్తిన ప్రతిసారీ కొత్త అంకాన్ని తెరమీదకు తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు సర్కారు వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.