YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భగరథ అస్తవ్యస్థం

భగరథ అస్తవ్యస్థం

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ ద్వారా తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల్లోని ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయడానికి రూ.1152 కోట్లను వ్యయం చేస్తోంది. 18 మండలాల పరిధిలోని పాత, కొత్త వాటితో కలిపి ఉన్న 565  గ్రామపంచాయతీల్లోని ప్రతి ఇంటికీ మంచినీటిని అందించడానికి సంబంధిత పనులను తీసుకున్న కాంట్రాక్టర్లు 2,693 కిలోమీటర్ల పొడవున ప్రధాన గొట్టాలను వేశారు. వాటి ద్వారా గ్రామాల్లో అక్కడక్కడా నిర్మిస్తున్న 46 భారీ ట్యాంకులకు నీటిని పంపింగ్‌ చేస్తారు. ఈ ట్యాంకుల నుంచి గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేయడానికి అవసరమైన పైపులు వేస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే... గ్రామాల్లో ఇప్పటికే రూ.కోట్ల వ్యయంతో సిమెంటు రోడ్లను నిర్మించారు. భగీరథ గొట్టాలు వేయడానికి ఆయా రోడ్ల కొసలు, మధ్య భాగాలను కిలోమీటర్ల పొడవున తవ్వేశారు. ఇవే గొట్టాల వెంబడి ఇంటింటికీ అంతర్జాల సేవలను అందించేందుకు అవసరమైన ప్రత్యేక గొట్టాలను సైతం వేశారు. ఈ పనులు పూర్తవగానే గుంతలను సిమెంటు, కంకర, ఇసుకను కలిపి తిరిగి మరమ్మతు చేస్తారేమోనంటూ గ్రామీణులు భావించారు. పనులు ముగిసిన తర్వాత కాంట్రాక్టర్లు అంతకుముందు తవ్వి వెలికి తీసిన మట్టినే పోసేసి వెళ్లి పోయారు. ఫలితంగా చక్కగా ఉన్న సిమెంటు రోడ్లన్నీ ఎగుడుదిగుడు మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల పరిధిలో 400 కిలోమీటర్ల పొడవున సిమెంటు రోడ్లు ఉండగా వీటిలో దాదాపు 50 శాతం రోడ్ల పరిస్థితి ఇదేవిధంగా మారినట్లు తెలుస్తోంది.

గుంతల మయంగా మారిన సిమెంటు రోడ్లతో వర్షాకాలంలో గ్రామీణులకు ప్రతికూల పరిస్థితులు తప్పేలా లేవు. వర్షపు నీరు వరదగా వస్తే సీసీ రోడ్ల గుంతల్లో పోసిన మట్టి బురదగా మారుతుంది. వరద ఉద్ధృతి అధికంగా ఉంటే ఆయాచోట్ల కోతలు కూడా ఏర్పడవచ్చు. అదే జరిగితే గ్రామీణుల రాకపోకలపై ప్రభావం పడుతుంది. బురదగా మారిన మట్టిపై నుంచి వెళ్లే బైక్ లు జారిపడే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితులు తలెత్తక ముందే అధికారులు సిమెంటు రోడ్లను మరమ్మతు చేయాల్సిన అవసరముంది.

Related Posts