‘తాను ఏప్రిల్ లోనే ప్రధానికి ఈ ప్యాకేజీ సూచించాను’: గల్లా జయదేవ్
విజయవాడ మే 13
ప్రధాని 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రశంసించిన గల్లా.. ‘తాను ఏప్రిల్ లోనే ప్రధానికి ఈ ప్యాకేజీ సూచించాను’ అని ట్వీట్ లో పేర్కొనడం సంచలనమైంది. ఇక ఆ తరువాత మరో ట్వీట్ లో సీఎం జగన్ చెప్పినట్టు కరోనాతో రానున్న రోజుల్లో కలిసి జీవించాల్సిందేనని గల్లా జయదేవ్ ట్వీట్లో పేర్కొన్నారు.దీంతో ఏపీ సీఎం జగన్ కు ప్రత్యర్థులైన టీడీపీ నుంచి కూడా మద్దతు లభించినట్టైంది. ఈ పరిణామం చంద్రబాబు సహా జగన్ ను తిట్టిన టీడీపీ నేతల నోట్లో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది. పార్లమెంట్ లో టీడీపీ ఫ్లోర్ లీడర్ స్వయంగా జగన్ కు మద్దతు పలకడం ఇప్పుడు టీడీపీలో దుమారం రేపుతోంది.‘కరోనాతో మనం కలిసి బతకాల్సిందే’ అని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన ఎంతో వివాదాస్పదమైంది.కానీ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత విమర్శలు చేసినా ప్రధాని నరేంద్రమోడీ సైతం నిన్న ఇదే విషయం చెప్పారు. ఆయనే కాదు.. స్వయంగా టీడీపీకే చెందిన ఎంపీ గల్లా జయదేవ్ సైతం ఏపీ సీఎం జగన్ చెప్పిన దానికే మద్దతు ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీంతో టీడీపీలో హాట్ హాట్ చర్చ మొదలైంది.కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జగన్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ చేతులెత్తేశాడని ఆడిపోసుకున్నారు.. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సహా మేధావులు ప్రపంచ ఆరోగ్య సంస్త సైతం కరోనాతో కలిసి బతకడమే మన ముందున్న కర్తవ్యమని.. లాక్ డౌన్ తో ఇంకా ఎన్నో నాళ్లు మనం దాక్కోలేమని కుండబద్దలు కొట్టారు.