భారీ ప్యాకేజీ వెనుక మోదీ మార్క్ స్కెచ్!
న్యూ ఢిల్లీ మే 13
మహమ్మారి కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజల బాగోగుల కోసం ప్రధాని మోదీ తాజాగా రూ. 20 లక్షల కోట్ల రూపాయలతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ ప్యాకేజీ వెనుక మోదీ మార్క్ స్కెచ్ ఉందని తెలుస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు దేశీయ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా ఇటు చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టేలా ఉంది. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా చైనా నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించాలనేది నరేంద్ర మోడీ అనుసరిస్తోన్న తాజా వ్యూహమని చెబుతున్నారు.ఈ వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి అవకాశాలను వెదుక్కునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంక్షోభ సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం అంటే సాధారణ విషయం కాదు. అసలే 50 రోజులుగా కొనసాగుతోన్న లాక్ డౌన్ నేపథ్యంలో క్రయ విక్రయాలు లేకపోవడం వల్ల ఖజానాకు రావాల్సిన మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. అంతకుముందే ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్న కేంద్ర ప్రభుత్వంపై తాజాగా కరోనా వైరస్ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చినప్పటికీ.. చెక్కుచెదరలేదు.అదే సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని తెర మీదికి తీసుకుని రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రధానంగా వ్యవసాయం దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడానికేనని ప్రధానమంత్రి తన ప్రసంగంలో స్పష్టంగా తెలియజేశారు. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి అనుగుణంగా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తామనీ చెప్పారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల పొరుగు దేశాల నుంచి భారత్ కు దిగుమతి అవుతోన్న వస్తువులను నియంత్రించడానికీ ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహకాలను అందించడం వల్ల చైనా వస్తువుల దిగుమతిని నియంత్రించడం సాధ్యపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి గ్యారంటీ లేకపోయినప్పటికీ.. చవగ్గా లభిస్తుండటం వల్ల చైనా వస్తువులు మన దేశీయ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. భారత్ పై తరచూ విషం చిమ్ముతూ కనిపించే చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ మనదేశంలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. చైనా వస్తువులను బాయ్కాట్ చేయడానికి ఇదే సరైన సమయమని నరేంద్ర మోడీ భావించి ఉండవచ్చని అంటున్నారు