గుజరాత్‌లో ఓ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు
ఖండించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
అహ్మదాబాద్ మే 13
గుజరాత్‌లో ఓ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్‌లో నాయకత్వ మార్పుచేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. గుజరాత్‌కు చెందిన ధావల్ పటేల్ అనే జర్నలిస్టు ఫేస్ ఆఫ్ నేషన్ అనే న్యూస్ పోర్టల్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మే 7న ఆ న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైన ఓ ఆర్టికల్‌లో.. గుజరాత్‌లో సీఎం విజయ్ రూపానీని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను నియమించే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని పేర్కొన్నారు. కరోనాను అదుపు చేయడంలో విజయ్ రూపానీ విఫలం కావడంతోనే అధిష్ఠాన ఈ నిర్ణయం తీసుకుందని రాశారు. అయితే ఈ వార్తలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఖండించారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124 (ఎ) ప్రకారం ధావల్ పటేల్‌పై దేశద్రోహం కేసు నమోదుచేశారు. ఈ మేరకు సోమవారం ధావల్‌ను అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ధావల్ తన వెబ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేశారని, దీనిపై క్రైమ్ బ్రాంచ్ ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసి ధావల్‌ను అదుపులోకి తీసుకుందని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ బీవీ గోహిల్ తెలిపారు. కాగా, ధావల్‌పై పోలీసుల చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. దేశంలో జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా క్రిమినల్ చట్టాలను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించింది.