సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ మే 13
ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఏఏ రంగాలకు పంపిణీ చేస్తున్నారో తెలిపేందుకు న్యూఢిల్లీలో నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిపివేసిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలను ఆమె ప్రకటించారు.అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. 45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. 15వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది. మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.