రెంటికి చెడ్డరేవడిలా జనసేనాని
కాకినాడ, మే 14,
జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ వ్యూహం ఫలించడం లేదు. ఆయన వేసిన ఎత్తులు రాజకీయంగా పెద్దగా ఉపయోగ పడటం లేదు. 2014 ఎన్నికల్లో తాను బయట నుంచి మద్దతు ఇవ్వడంతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పవన్ కల్యాణ‌్ ఇప్పటికీ భావిస్తారు. కానీ అందులో ఏమాత్రం నిజంలేదు. చంద్రబాబు అప్పటి గెలుపునకు అనేక కారణాలున్నాయి. అంతే తప్ప పవన్ కల్యాణ‌్ మద్దతిచ్చినంత మాత్రాన చంద్రబాబు గెలవలేదన్నది వాస్తవం. కానీ పవన్ కల్యాణ‌్ ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నట్లుంది.2019 ఎన్నికల్లోకి వచ్చేసరికి పవన్ కల్యాణ‌్ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ ప్రయత్నాన్ని అందరూ హర్షించదగిందే. ఒక ప్రాంతీయ పార్టీ బలపడాలంటే తొలుత సొంత బలమేంటో నిరూపించుకోవాలి. సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ను సంపాదించుకోవాలి. కానీ ఓటు బ్యాంకును సంపాదించుకునే సమయంలోనే పవన్ కల్యాణ‌్ తప్పులో కాలేశారు.నిజానికి పవన్ కల్యాణ్ కు కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇక ఆయన అభిమానులు కులాలు, మతాలకు అతీతంగా సపోర్టు చేయనున్నారు. కానీ జగన్ దెబ్బకొట్టేందుకు దళిత ఓటుబ్యాంకుపై గత ఎన్నికల్లో పవన్ కల్యాణ‌్ కన్నేశారు. దళిత ఓటు బ్యాంకు పూర్తిగా జగన్ వైపే ఉంది. గతంలో కాంగ్రెస్ వైపు ఉన్న ఆ ఓటు బ్యాంకును జగన్ తనవైపు తిప్పుకున్నారు. 2014 ఎన్నికల నుంచే ఇది మొదలయింది. కానీ పవన్ కల్యాణ్ ఆ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టి తాను కాకుండా చంద్రబాబు లబ్ది పొందాలని చూశారన్న విమర్శలుఉన్నాయి.ఇందుకు బీఎస్పీని ఏపీలో రంగంలోకి దించడమే కారణం. బీఎస్పీకి ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ ఓటు కూడా లేదు. అయినా ఆ ఓటు బ్యాంకు కోసం మాయావతి కాళ్లు మొక్కారు పవన్ కల్యాణ్. అనేక చోట్ల బీఎస్పీ అభ్యర్థులను జగన్ పార్టీని ఓడించేందుకే రంగంలోకి దించారన్న టాక్ పోలింగ్ కు ముందే బయటకు రావడంతో బీఎస్పీ ప్రభావం ఏమాత్రం పనిచేయలేదు. ఎన్నికల సమయంలో మయావతి చుట్టూ తిరిగిన పవన్ తర్వాత ఆమె ఊసు కూడా ఎత్తడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీలోకి దిగుతానంటున్నారు. ఏపీలో బీజేపీ కూడా బీఎస్పీ లాగానే. సేమ్ టు సేమ్. నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చిన పార్టీ. మరి పవన్ కల్యాణ‌్ అంచనా ఏందో? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో? ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు.