ఎల్జీపై ఊహించని చర్యలుంటాయి
విశాఖపట్నం మే 14
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై ఎవరూ ఊహించని విధంగా చర్యలు ఉంటాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్‌జీ కంపెనీలో భద్రతాపరంగా చర్యలు తీసుకోవడంలో యాజమాన్య వైఫల్యం ఈ దుర్ఘటనకు కారణమని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో శాశ్వతంగా వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.విశాఖ ప్రజలు కుట్రపూరిత ప్రచారాలను నమ్మవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ఐదుగురు మంత్రులు, ఎంపీలు బస చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు యథాస్థితికి వచ్చేవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్వార్థ రాజకీయాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దని హితవు పలికారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అబద్దాల ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.