దుర్ఘటనపై ఇకనైనా రాజకీయాలు మానాలి
విశాఖపట్నం మే 14,
ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఇకనైనా రాజకీయాలు మానాలని మంత్రి కన్నబాబు సూచించారు. ఈ ఘటనలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని తెలిపారు. స్టైరెన్ తరలింపు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. విశాఖ ఒక టన్ను స్టైరెన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎల్‌జీ పాలిమర్స్ నుంచి ఇప్పటికే స్టైరిన్ తరలింపు ప్రక్రియ మొదలైందని, ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్ కూడా ట్యాంకర్ల ద్వారా పోర్టుకు తరలించామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయకోణంలో చూడడమే చంద్రబాబు పని అని, బాబు బతుకంతా కుట్ర రాజకీయమేనని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి బాధితులని ఆదుకునే ప్రయత్నం చేసిందో ప్రతిపక్షాలు గమనించుకోవాలన్నారు.