కార్పొరేట్ కాలేజీలపై ఉక్కుపాదం
విజయవాడ, మే 14,
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇష్టం వచ్చినంత మంది విద్యార్థులను, ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉండదు.కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో సెక్షన్‌లో అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి 9 సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కార్పోరేట్ దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయిఒకటి నుంచి వందలోపు వెయ్యి ర్యాంకులంటూ టీవీలు, పేపర్లలో ప్రకటనలు చూసి మోసపోయి లక్షల రూపాయల ఫీజులు చెల్లంచి అయినా సరే ఇందులో సీటు పొందేందుకు విద్యార్ధులు క్యూ కడుతున్న పరిస్ధితి. దీంతో ప్రకటనలు చూసి మోసపోయి ఇక్కడికి వచ్చే సాధారణ విద్యార్ధులు మాత్రం లక్షల ఫీజులు పోసినా నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ పరిస్దితిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ప్రచార సమయంలో కార్పోరేట్ కాలేజీల దోపిడీ గురించి పదే పదే ప్రస్తావించేవారు. తాము అధికారంలోకి వస్తే సదరు కార్పోరేట్ కాలేజీలకు చెక్ పెట్టడం ఖాయమని చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చే క్రమంలో ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.