YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఒకే మాటమీద టీ కమలం

ఒకే మాటమీద టీ కమలం

ఒకే మాటమీద టీ కమలం
హైద్రాబాద్, మే 15,
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో నెం.203 ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌గ‌డంగా మారింది. రాయ‌ల‌సీమ‌కు కృష్ణా న‌ది నుంచి నీటిని త‌ర‌లించి క‌రువును నివారించాల‌నేది ఏపీ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. అయితే, ఈ ప్రాజెక్టులు గ‌నుక నిర్మిస్తే ఏకంగా కృష్ణా న‌దినే రాయ‌ల‌సీమ‌కు మ‌లుపుకున్న‌ట్లు అవుతుంద‌ని, కృష్ణా న‌దిపై ఆధార‌ప‌డ్డ ఉమ్మ‌డి మ‌హ‌బుబ్‌న‌గ‌ర్‌, న‌ల్గొండ‌, రంగారెడ్డి జిల్లాలు న‌ష్ట‌పోతాయ‌ని తెలంగాణ అభ్యంత‌ర‌పెడుతోంది. అయితే, తాము త‌మ‌కు ఉండే వాటాకు మించి ఎక్క‌డ చుక్క నీటిని కూడా ఎక్కువ వాడుకోబోమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స‌మాధానం చెబుతోంది.రెండు రాష్ట్రాల వాద‌న‌లను కాసేపు ప‌క్క‌న పెడితే జీవో నెం.203పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని నేత‌లు, పార్టీల వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం విభేదాలు ఉన్నా ఒకే మాట‌పైన నిలుస్తున్నాయి తెలంగాణలోని రాజ‌కీయ పార్టీలు. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అస‌లు, ఈ విష‌యంపై క‌నీసం స్పందించేందుకు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. ఇక‌, మ‌రో ప్ర‌ధాన పార్టీగా ఉన్న జ‌న‌సేన కూడా ఈ విష‌యంలో ఇంత వ‌ర‌కు నోరెత్త‌లేదు. క‌నీసం త‌మ అభిప్రాయాలు ఏంట‌నే విష‌యాల‌ను కూడా చెప్ప‌డం లేదు.ఈ నెల 5వ తేదీన ఏపీ ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌గానే తెలంగాణ‌లో మొద‌ట ప్ర‌తిప‌క్ష పార్టీలే స్పందించాయి. ఈ జీవో వ‌ల్ల, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిపాదించిన ప్రాజెక్టుల వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ‌ళమెత్తాయి. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఒక‌వైపు న్యాయ‌పోరాటానికి, మ‌రోవైపు ప్ర‌త్య‌క్షం పోరాటానికి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఆ పార్టీ నాయ‌కులు ఒక రోజు దీక్ష కూడా చేశారు.బీజేపీ కూడా ఈ విష‌యంపై సీరియ‌స్‌గానే స్పందిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రికి లేఖ రాశారు. ఒక రోజు దీక్ష చేశారు. క‌మ్యూనిస్టులూ, తెలంగాణ జ‌న స‌మితి, యువ తెలంగాణ పార్టీ కూడా గ‌ట్టిగానే మాట్లాడుతున్నాయి.తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఏపీ తీసుకువ‌చ్చిన జీవోపై సీరియ‌స్ అయ్యింది. ఇప్ప‌టికే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. సుప్రీం కోర్టును సైతం ఆశ్ర‌యించేందుకు సిద్ధంగా ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఏపీ నిర్మించబోయే ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. అయితే, కేసీఆర్ నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని, ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కొన్ని ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నా.. మొత్తంగా ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షాలు అన్నీ తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, ఏపీ ప్రాజెక్టుల‌ను అడ్డుకోవాల‌నే ఏకాభిప్రాయంతో ఒకే మాట మీద ఉన్నాయి.కానీ, ఈ ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. ఏపీలో పార్టీలు ప్ర‌తీ అంశాన్నీ రాజ‌కీయంగానే చూస్తాయి. రాయ‌ల‌సీమ‌, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌కు క‌నీసం తాగు నీరు కూడా లేద‌ని, కాబ‌ట్టే ఈ ప్రాజెక్టులు ప్ర‌తిపాదించిన‌ట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.ఇటువంటి స‌మ‌యంలో అస‌లు త‌మ వైఖ‌రి ఏంట‌నేది తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు చెప్ప‌డం లేదు. అస‌లు ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టులు స‌రైన‌వేనా, వృథానా అనే విష‌యాల‌పై కూడా మాట్లాడ‌టం లేదు. అయితే, ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఒక‌టే కాబ‌ట్టి తాను మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు స‌యోధ్య‌తో ఉన్న మాట వాస్త‌వ‌మే. కాబ‌ట్టి, వీరి స్నేహం విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి క‌నీసం ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టుల‌పై త‌న అభిప్రాయం ఏంట‌నేది అయినా చెప్పాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపైన ఉంది.లేక‌పోతే నిజంగానే తెలంగాణ నేత‌లు చెబుతున్న‌ట్లుగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టులు అక్ర‌మ‌మే అని, అందుకే చంద్ర‌బాబు మాట్లాడ‌టం లేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంది. ఇక‌, జ‌న‌సేన పార్టీ కూడా ఈ విష‌యంపై స్పందించ‌డం లేదు. నిజానికి రాయ‌ల‌సీమ క‌రువు, వెనుక‌బాటుత‌నం గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తుంటారు. అటువంటి రాయ‌ల‌సీమ‌కు నీరందించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టుల‌పై ఆయ‌న 10 రోజులుగా త‌న వైఖ‌రి చెప్ప‌డం లేదు.ఇక‌, బీజేపీ తెలంగాణ‌లో ఆ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల మేర‌కు, ఏపీలో ఏపీ ప్ర‌యోజ‌నాల మేర‌కు రెండు మాట‌లు మాట్లాడుతోంది. ఏపీ ప్ర‌తిపాదించిన ప్రాజెక్టుల‌ను అడ్డుకొని తీరుతామ‌ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అంటున్నారు. కేంద్రానికి లేఖ రాసి, దీక్ష‌కు కూడా దిగారు.మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఫుల్ స‌పోర్ట్ ఇస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గొద్ద‌ని, క‌చ్చితంగా ప్ర‌తిపాదించిన ప్రాజెక్టుల‌ను నిర్మించాల‌ని అంటున్నారు. కాంగ్రెస్ కూడా రెండు రాష్ట్రాల రెండు వాద‌న‌లు వినిప‌స్తోంది. ఇక‌, తేల్చుకోవాల్సింది తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలే.

Related Posts