ప్రేమ మరిచిపోలేక ఆత్మహత్య
నల్గొండ, మే 15,
వాళ్లిద్దరు పదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇళ్లు విడిచిపోయారు. ఆ తర్వాత పెద్దల మధ్య జరిగిన పంచాయతీ కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇద్దరికి వేర్వేరుగా వివాహాలు జరిగాయి. అయితే ఆ మహిళ భర్త ఇటీవల చనిపోవడంతో ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమాయణం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు మందలిచండంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నింపింది. వరంగల్ అర్బన్ జిల్లా కమాలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన రమ్య(29), అదే గ్రామానికి చెందిన గండ్రకోట రాజు(30) పదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలు అడ్డుచెప్పడంతో పెళ్లి చేసుకునేందుకు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో పెద్దలు పోలీసులను ఆశ్రయించగా పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతి అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రమ్య భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా రమ్య అంబాలలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.మరోవైపు రాజుకు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్వాయికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. రాజు భార్య, బిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. 10 నెలల క్రితం రమ్య భర్త తిరుపతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె విషాదంలో మునిగిపోయిది. అదే సమయంలో రాజు స్వగ్రామంలో ఇల్లు కట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి తిరిగొచ్చేశాడు. రమ్య భర్త చనిపోయిన విషయం తెలుసుకుని ఆమెను ఓదార్చాడు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమాయణం మొదలైంది. రాజు తరుచూ ప్రియురాలి ఇంటికి వెళ్లి శారీరకంగా కలిసేవాడు. రాజు తరుచూ రమ్య ఇంటికి వెళ్తుండటంతో ఇద్దరి సంబంధం గురించి గ్రామంలో చర్చ మొదలైంది. దీంతో ఇద్దరిని వారి కుటుంబసభ్యులు మందలించారు.ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం రాజు, రమ్య కలిసి పారిపోయారు. దీంతో రాజుపై రమ్య కుటుంబసభ్యులు కిడ్నాప్ కేసు పెట్టారు. కమలాపూర్ పోలీసులు వారి కోసం వెతుకుతుండగానే గురువారం ధర్మారం చెరువులో రెండు మృతదేహాలు తేలాయి. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు చెరువు వద్దకు చేరుకొని చనిపోయిన వారిని రాజు, రమ్యగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరు గురువారం ఆటోలో చెరువు వద్దకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమ పదేళ్ల ప్రేమను మరిచిపోలేకే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.