రెండు రకాల యాంటీ బాడీలు
న్యూఢిల్లీ, మే 15,
కరోనా నుంచి కోలుకున్న ఓ బాధితుడిలో రెండు రకాల యాంటీబాడీలను పరిశోధకులు గుర్తించారు. కరోనా వైరస్ బారినపడ్డ రోగులకు చికిత్స కోసం యాంటీ వైరల్ ఔషధాలు, వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌లోని గ్లైకోప్రొటీన్ స్పైక్‌కు ఈ యాంటీబాడీలు అతుక్కుంటున్నాయని పరిశోధనలో బయటపడింది. తద్వారా మానవ కణాల్లోని ఏసీఈ2 రెసెప్టార్లతో సంధానం కాకుండా వైరస్‌కు అడ్డుకట్ట వేస్తున్నాయని గుర్తించారు. కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించడానికి ఈ రెసెప్టార్లు వారధిలా పనిచేస్తున్నాయి.ప్రాథమికంగా గుర్తించిన యాంటీబాడీలను బి38, హెచ్4గా పేర్కొంటున్నారు. ఒక్కొక్కటిగా కాకుండా రెండు కలిసి ఏకకాలంలో వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌కు అతుక్కున్నప్పుడు.. ఆ సూక్ష్మజీవికి మెరుగ్గా అడ్డుకట్ట పడుతోందని గుర్తించారు. ఒక యాంటీబాడీని బోల్తా కొట్టించేలా వైరస్ తన రూపును మార్చుకున్నా.. రెండోది సమర్థంగా పనిచేస్తుందని వారు తెలిపారు. చైనాలోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు.కాపిటల్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు యాన్ వు, అతడి సహచరులు రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ)లోని వేర్వేరు ఎపిటోప్‌లతో ప్రతిరోధకాలు స్పైక్‌లను ఏకకాలంలో బంధించవచ్చని కనుగొన్నారు. వైరల్ ఎపిటోప్‌లలో ఒకటి.. ప్రతిరోధకాలలో ఒకదానిని బంధించడాన్ని నిరోధించే విధంగా రెండు యాంటీబాడీలుగా పరివర్తనం చెందితే, మరొకటి దాని తటస్థీకరణ చర్యను నిలుపుదల చేస్తుందని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు B38 యాంటీబాడీ బలమైన తటస్థీకరణ ప్రభావాలను ఎందుకు చూపుతుందో కూడా పరిశోధకులు వివరించారు. రెండు ప్రతిరోధకాలను కలిగిన ‘కాక్టెయిల్’ కోవిడ్-19 రోగులకు ప్రత్యక్ష చికిత్సా ప్రయోజనాలను అందించగలదని పరిశోధకులు సూచిస్తున్నారు