300లకు చేరిన చికెన్
విజయవాడ, మే 15
ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెండు నెలల గ్యాప్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. విజయవాడతో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ధరలు అమాంతం కొండెక్కగా.. రెండు వారాలుగా కిలో రూ.200 లోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.300 దాటింది. గురువారం స్కిన్‌లెస్ కేజీ రూ.310 ఉంటే.. విత్ స్కిన్ కేజీ రూ.300 చేరడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇటు కోడి గుడ్డు ధరలు కూడా పెరిగాయి.. కరోనా కారణంగా గతంలో గుడ్డు ధర రూ.2 ఉండగా.. అది రూ.4కి చేరింది.మూడు నెలల క్రితం వరకు ఫౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా దెబ్బకు చికెన్ పేరు చెబితేనే జనాలు వణికిపోయారు.. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫౌల్ట్రీ యజమానులు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు.. చికెన్ షాపుల్లో ఆఫర్లు పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. కానీ రెండు, మూడు వారాలుగా పరిస్థితి మారిపోయింది.. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముందు రూ.100కు చేరిన ధర.. తర్వాత రూ.200.. ఇప్పుడు రూ.300కు చేరింది.ఇక వీకెండ్‌లో జనాలు చికెన్ షాపులకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల కిలో మీటర్ల పొడవున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.. చికెన్‌తో పాటూ మటన్‌కు కూడా డిమాండ్ పెరిగింది. కోళ్లకు డిమాండ్ పెరగడంతో ఫౌల్ట్రీల యజమానులు ఆనందంలో ఉన్నారు. కోళ్ల ఫారాలన్నీ త్వరగానే ఖాళీ అవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం.. మార్కెట్ కొరతను గుర్తించి ధరలు పెంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఫౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకాలను తగ్గించడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.