రైతు భరోసా స్వాహా...
నెల్లూరు, మే 16
తును రాజుని చేస్తామంటూ తాను నమ్మిన నవరత్నాలలో ఒక రత్నంగా రైతుకి అండగా ఉంటామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రైతు భరోసాలో భారీ అవకతవకలు జరిగాయా? పారదర్శకత అంటే ఎలా ఉంటుందో తాను చేసి చూపిస్తానంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందుగా ఘంటాపదంగా చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో సౌలభ్యం కోసమే వాలంటీర్లు అంటూ మరో కొత్త వ్యవస్థనే సృష్టించారు.కానీ ఇప్పుడు ఆ వాలంటీర్లే స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలను దిగమింగేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా పథకంలో కౌలు రైతుల పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నట్లుగా వినిపిస్తుంది. ఇప్పటికే బాధిత రైతులతో పాటు స్థానిక ప్రతిపక్ష పార్టీల నేతలు.. పై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం లేదంటూ వాపోతున్నారు.ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు కుటుంబానికి 12500 పెట్టుబడి సాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక అది ప్రధాని కిసాన్ పథకంతో కలిపి అమల్లోకి తెచ్చారు. అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చేది 6500 మాత్రమే.. దీనిపై విమర్శలు రావడంతో మరో వెయ్యి అదనం అంటూ కొద్దిగా ఏమార్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇప్పుడు విడతల వారీగా 13500 కుటుంబానికి అందించాల్సి ఉంది.కాగా ఈ పథకంలో లొసుగులు ఎక్కువగా ఉన్నాయని.. స్థానిక నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని పథకం మొదలైన తొలిరోజుల్లోనే వినిపించింది. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అది కాస్త పెరిగి పెద్దదై కౌలు రైతులను అడ్డం పెట్టుకొని కోట్లలో దోపిడీకి తెగబడినట్లుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా వాలంటీర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ఈ దోపిడీకి తెగబడుతున్నట్లుగా తెలుస్తుంది.ఈ అక్రమాలు కూడా ఎంత తెలివిగా.. ఎంతో చాకచక్యంగా ఈ దందా సాగుతుందని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వారి పట్టాదారు వివరాలు, ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. కుటుంబ వివరాలతో సహా అన్నీ వాలంటీర్ల వద్దే ఉన్నాయి. లేకపోయినా వారు అడిగితే చచ్చినట్లు ఏదైనా ఇవ్వాల్సిందే. దీంతో కౌలు రైతులు అనే అప్షన్ ద్వారా తన దోపిడీని మొదలుపెట్టారు. దీనిని ఒక క్రమ పద్ధతిలో అవలంభిస్తున్నారని చెప్పారు.ముందుగా తమ పంచాయతీ పరిధిలో తమ వద్ద ఉన్న భూవివరాలలో స్థానికంగా నివాసం లేని వారు... ఉన్నా తమ మాట వింటారు అనుకున్న వాళ్ళని ఓ లిస్ట్ తయారుచేస్తారు. వారి పట్టాదారు వివరాలను తమకు అనుకూలమైన అదే పంచాయతీకి చెందిన వారిపై కౌలు దారులుగా రికార్డులకు ఎక్కించారు. తమకి అనుకూలమైన వారిపై వచ్చిన రైతు భరోసాను కౌలు రైతులుగా ఉన్న వ్యక్తులతో కలిసి వాలంటీర్లు, నేతలు దింగమేస్తున్నారు.