కొత్త చరిత్ర రాస్తున్న గాంధీ
హైద్రాబాద్, మే 17
హైదరాబాద్ గాంధీ దవాఖాన వైద్యరంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే వైరస్ లకు వ్యాక్సిన్లు, మందుల వినియోగానికి గాంధీ ప్రయోగాలకు సిద్దమవుతుంది. ఇందుకోసం దేశంలోని పలుసంస్థలు, ప్రభుత్వాలతో గాంధీ వైద్యులు, నిపుణులు పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలుకాగా త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రయోగాలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది.ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తించి సమస్థ మానవాళికి సంకటంగా మారిన కరోనా వైరస్ కి చికిత్స అందించిన మన దేశంలోని తొలి ఆసుపత్రులలో గాంధీ ఆసుపత్రి కూడా ఒకటి. కాగా ఇప్పటికే ఇక్కడ కరోనాకు చికిత్సలో కీలకంగా భావించే ప్లాస్మా థెరఫీకి కూడా ప్రయోగం మొదలైంది. ఇప్పటికే కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన దాతల నుండి ప్లాస్మాను సేకరించి ప్రయోగం మొదలుపెట్టారు.ఇప్పటికే ప్లాస్మా థెరఫీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి ఇవ్వగా ఇప్పటికే దాతల వివరాలను గాంధీ బృందం ఐసిఎంఆర్ కి పంపించారు. అక్కడ నుండి అనుమతులు వచ్చిన వెంటనే ప్లాస్మా థెరపీని ప్రారంభిస్తారు. ఇది సక్సెస్ అయితే దాదాపుగా కరోనాలో మరణాలను అధిగమించవచ్చు.కాగా ఇక ఇదే వరసలో కరోనాకు వ్యాక్సిన్, మందులను కూడా ప్రయోగించేందుకు సిద్దమవుతున్నారు. అందుకు ఐసీఎంఆర్‌తో ఒప్పందం చేసుకోవడానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఇప్పటికే సక్సెస్ అయిన యాంటీవైరల్ డ్రగ్స్‌ను కరోనా పాజిటివ్స్‌కు క్లినికల్ ట్రయల్ బేస్‌గా వినియోగించనున్నట్లుగా తెలుస్తుంది.ఇక కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీ, వైరస్ నివారణ మందులపై కూడా పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మొబైల్ కంటైనర్ వైరల్ రిసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ఇందులో గాంధీ వైద్యులు కూడా కీలకం కానుండగా ఇక్కడ సక్సెస్ అయితే పూర్తిగా వైరస్ లకు వ్యాక్సిన్, మందులలో గాంధీ ప్రయోగశాల కానుంది.కాగా ఒక్కసారి గాంధీ ఆసుపత్రి చరిత్రను తిరగేస్తే ఎన్నో ప్రయోగాలు.. ఎన్నెన్నో విజయాలు మనకి కనిపిస్తాయి. 1976లో తొలిసారిగా గాంధీ ఆస్పత్రి ఓ వ్యక్తికి మొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పునర్జన్మనివ్వగా అప్పటి నుంచి గాంధీలో వేలకుపైగా హార్ట్ సర్జరీలు జరుగగా అదే ఏడాదిలోనే ఐసీయూ పీడియాట్రిక్, న్యూరాలజీ విభాగాలకు గాంధీలో నెలకొల్పారు.ఇక తర్వాత ఏడాది 1977లో కార్డియో క్యాథటరైజేషన్ ల్యాబొరేటరీ, 1979లో యూరాలజీ, 1985లో గ్యాస్ర్టో ఎంట్రాలజీ, 1989లో ఎండోక్రైనాలజీ, 1991లో కార్డియోథొరాసిక్ సర్జరీ, ప్లాస్టిక్, నెఫ్రాలజీ ఇలా అనేక విభాగాలను విస్తరించి సూపర్‌స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. అప్పుడప్పుడు దారితప్పిన వైద్యం.. అక్రమాలకు నిలయం.. అవకతవకల దవాఖాన అనే పేర్లు వినిపించినా అందంతా కొందరు ఉద్యోగులు, వైద్యుల నిర్లక్ష్యం వలనే కాగా గాంధీ ఖ్యాతి ఏ మాత్రం తగ్గడం లేదు.