దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యానికి "శ్రీ పార్వతీ దేవి కల్యాణం"
భార్యాభర్తలు ఎలా కలిసి మెలిసి ఉండాలో ఉండాలో ఈ పార్వతీదేవి కల్యాణం మనకు చెబుతుంది. ప్రకృతీ పురుషులు ఆ పార్వతీ పరమేశ్వరులు. వారి అన్యోన్యత దాంపత్యం గురించి ఎంత చక్కగా వివరించినారో . ప్రతి కార్యంలో కూడా ధర్మపత్ని యొక్క చేయూత తప్పక వుండాలి అని చెబుతుంది పార్వతీ దేవి కల్యాణ ఘట్టం. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహాం జరిగిన తరువాత దంపతులమధ్య అన్యోన్నత కొరకు, సంతాన దోష నివారణకు పార్వతీ కల్యాణం చదవటమే కాకుండా నిత్య కళ్యాణం జరిగే ఆలయంలో కళ్యాణం చేపించుకొని ఈ గ్రంధాలను పంచిన వైవాహిక సమస్యల నుండి బయటపడతారు. ఎక్కడైనా అన్యోన్యంగా జంట కన్పిస్తే పార్వతీ పరమేశ్వరుల్లా, ఆదిదంపతుల్లా ఉన్నారంటాం గానీ సీతారాముల్ని, రాధాకృష్ణుల్నీ ఆ సందర్భంలో స్మరించం. శంకరునికి భార్యపట్ల ఎంత మక్కువంటే - ఆమెని చూడాలనే తహతహతో వచ్చే తనని... నలుగుపిండి రూపంతో బాలకునిగా ఉన్న ఒకడు అడ్డగిస్తే అతడి తలను ఖండించి మరీ లోపలికి వెళ్లిపోయాడు తప్ప, మరి దేన్నీ ఆలోచించలేదాయన. విషాన్ని మింగవలసిందని పార్వతి ఆజ్ఞాపించిందనేగానే అది తనకి ఏ కష్టాన్ని కల్గిస్తుందోనని ఆలోచించనే ఆలోచించకుండా ‘మ్రింగుమనె సర్వమంగళ’ - ఆమె తాగవలసిందేనంటే అది ప్రజాక్షేమం (తమ సంతానానికి శుభం కలిగించేదే) కోసమే అయ్యుంటుందనే ఆలోచనే శంకరునిది. తాగేసాడు. పార్వతి మాటమీద అంతటి నమ్మకం ఆయనకి. ప్రాణాన్ని తీసే విషం కూడా (తాగమన్నది పార్వతి కాబట్టి) తనకి ప్రాణాన్ని ఇచ్చేదే అయ్యుంటుందనేది శంకరుని విశ్వాసం. దంపతులకి కావల్సిందిదే. తన భార్యకి అవమానం జరిగిందని తెలిసి మామ తలని నరికించడానిక్కూడా వెనుకాడనంతటి ఇష్టం పార్వతి మీద శంకరునికి.
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే
నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
ఇలా వధూవరుల స్వరూపాలు పరస్పర విరుద్ధంగా ఉన్నా “ఆది దంపతులు” ఎలా విడదీయలేకుండా ఉంటారో మహాకవి కాళిదాసు మాటల్లో:
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
యౌ: ఎవరు, వాగర్థావివ: శబ్దార్థములవలె, సంపృక్తౌ: కలిసియుండిరో, జగతః జగతికి, పితరౌ: తలిదండ్రులో, తౌ : ఆ, పార్వతీ పరమేశ్వరౌ : పార్వతిని పరమేశ్వరుని, వాగర్థ ప్రతిపత్తయే : శబ్దార్థములను సరిగా ఎరుగుటకు, వందే : నమస్కరించుచున్నాను.
అలాంటి అన్యోన్య దంపతులు లోకానికి మేలు జరగడం కోసం ఎలా ప్రవర్తిస్తారో పోతన భాగవతం లో:
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళ సూత్రమ్ము నెంతమది నమ్మినదో
ఈ పద్యం లో ముఖ్యంగా క్రింది విషయాలని గమనించాలి.
1. హాలాహలాన్ని వామ హస్తం లో గ్రహించిన శివుడు పార్వతి ఆమోదం కొరకు చూడటం
2. పార్వతీ దేవికి భర్త మీద (మంగళ సూత్రం మీద) గల నమ్మకం
3. ప్రజా హితమైన కార్యం కోసం త్యాగం చేయగలగడం
ప్రతీ దంపతుల జంటా ఈ “ఆది దంపతులను” ఆదర్శంగా తీసుకుని జీవిస్తే జగత్తుకు ఎల్లప్పుడూ సర్వ మంగళమే జరుగుతుంది. వివాహం భౌతిక అవసరమే కాదు, సామాజిక బాధ్యత కూడా అని సామాజికులు నిర్వచించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనకు వివాహమే మార్గదర్శి అని ఆధ్యాత్మికులు ప్రవచించారు. అర్ధనారీశ్వరతత్వాన్ని ఆవిష్కరించే పార్వతీ పరమేశ్వరుల్లో దేహం శివరూపమైతే, దాన్ని కదిలించగలిగే చైతన్యం పార్వతి. ఆలోచననుంచి దాన్ని ఆచరించే వరకూ అన్నీ చేసేది శివుడు, ఆయనకు సహకరించేది పార్వతి. అలా చేసే పనులు, ఆలోచనలు సరిసమానంగా పంచుకునే జంటలకు పార్వతీ పరమేశ్వరులే ఆదర్శం. అందుకే కాళిదాసు- పార్వతీ పరమేశ్వరులు వాక్కు, అర్థంలా కలిసిపోయారనీ ఆదిదంపతులనీ కీర్తించాడు, కొనియాడాడు.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో