YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

షాడో సీఎం గా విజయసాయిరెడ్డి..?

షాడో సీఎం గా విజయసాయిరెడ్డి..?

షాడో సీఎం గా విజయసాయిరెడ్డి..?
విశాఖపట్టణం, మే 18,
దేంటి ఇప్పటికే ఏపీ రెండు ముక్కలు అయింది. ఇది చాలదా? ఇంకా కొత్త కుర్చీలు కావాలా? అని తెలుగు ప్రాంతాల అభిమానులు, జనాలు అడుగుతున్నారు. నిజమే కదా. పాలకుండలా ఒక్కటిగా ఉన్న ఉమ్మడి ఏపీని రెండుగా విభజించారు. దాంతో ఇద్దరు సీఎంలు అయ్యారు కానీ ప్రజలకు ఒరిగిందేంటి. ఇంకా కొత్త ఖర్చులు పెరిగాయి. ప్రజల పన్నులతో మరింతగా సర్కార్ సోకులు సాగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ ఉంది. ఇంకో వైపు చూసుకుంటే తెలంగాణాలో కూడా ఉత్తర, దక్షిణ తెలంగాణా విభేధాలు ఉన్నాయి. ఏవి ఎలా ఉన్నా రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులూ చాలు అంటున్నారు జనం. ఇక ఏపీలో మూడు కీలకమైన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటి, దానికి కొత్త సీఎంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రకటించేసింది సోషల్ మీడియా. మరి ఏ పార్టీ అభిమానులో తెలియదు కానీ విజయసాయిరెడ్డిని ఉత్తర కోస్తా సీఎం గారు అంటూ వ్యంగ్యంగా పిలుస్తున్నారు.జగన్ మిగిలిన ప్రాంతానికి ముఖ్యమంత్రి అయితే ఉత్తర కోస్తాకు మాత్రం విజయసాయిరెడ్డేనట. ఆయన చక్రం అక్కడ గిర్రున తిరుగుతుందట. విజయసాయిరెడ్డి తలచుకుంటేనే అక్కడ చిగురాకు కొమ్మ కూడా కదులుతుందిట. ఇవీ సోషల్ మీడియాలో సాయిరెడ్డి మీద పెడుతున్న పోస్టింగులు. ఇక మరో వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఊళ్లకు ఊళ్ళూ విజయసాయిరెడ్డికి రాసిచ్చేస్తున్నారు. విశాఖపట్నం కాదు విజయసాయిపట్నం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారు. విజయసాయిరెడ్డి వచ్చాక విశాఖలో అశాంతి పెరిగిపోయిందని కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు.ఇక జగన్ కి విజయసాయిరెడ్డికి పడదని కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వార్తలు రాస్తున్నారు. విజయసాయిరెడ్డి జగన్ని మించేశారని కూడా వేడి వేడిగా కధనాలు వండి వారుస్తున్నారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర మూలాలు అన్నీ తెలుసునని, జగన్ని ఆయన సైడ్ చేస్తున్నారని కూడా రాసేస్తున్నారు. అందుకే జగన్ కి ఆయన మీద కోపం వచ్చి విశాఖ టూర్లో ఆయన్ని లేకుండా హెలికాప్టర్ దించేశారని కూడా విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే విజయసాయిరెడ్డి ఈ రోజుకు ఉత్తరాంధ్రా, రేపటికి ఏపీకే సీఎం అని కూడా పచ్చ పార్టీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారు. మరి జగన్ కి సన్నిహితుడుగా ఉన్న విజయసాయిరెడ్డిని ఎందుకో దారుణంగా టార్గెట్ చేస్తున్నారు.ఇక విజయసాయిరెడ్డి విశాఖలో అతి పెద్ద విపత్తు జరిగితే ఎక్కడా కనిపించకపోవడం కూడా చర్చకు వస్తోంది. మరో వైపు ఆయనకు ఎల్జీ పాలిమార్స్ యాజమాన్యంతో సంబంధాలు ఉన్నాయని, భూరి విరాళాలు ఆయన ట్రస్ట్ తరఫున సేకరించారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందువల్లనే జగన్ ఆయన్ని పక్కన పెట్టారని, ఈ ఆర్ధిక లావాదేవీలు చివరికి జగన్ మెడకు కూడా చుట్టుకునేలా ఉన్నాయని కూడా తమ్ముళ్ళు అంటున్నారు. అయితే ఆపదలో కూడా రాజకీయమేనా అని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆయన బాధితులను తాజాగా పరామర్శించడమే కాదు,వారి ఇళ్లలో బస చేసి రాత్రి నిద్ర చేశారు. తమకు పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెబుతున్నారు. ఏది ఏమైనా విశాఖలో జరిగిన దుర్ఘటన తరువాత విజయసాయిరెడ్డికి లింక్ పెట్టి జరుగుతున్న ప్రచారంలో ఆయన ప్రతిష్ట కొంత దెబ్బ తిందని ప్రచారం సాగుతోంది. పైగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన మీద జరుగుతున్న వ్యతిక్రేక ప్రచారం కూడా అసలుకే ఎసరు తెస్తుందా అన్న డౌట్లు వైసీపీలో ఉన్నాయి.

Related Posts