YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జయకేతనం పేరుతో స్టేజ్ షోలు

జయకేతనం పేరుతో స్టేజ్ షోలు

జయకేతనం పేరుతో స్టేజ్ షోలు
విజయవాడ, మే 18
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి భిన్నమైన పథకాలను తేవడమే కాదు భిన్నమైన కళా ప్రదర్శనలను ప్రోత్సహిస్తున్నారు. ఆహా ఓహో అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ స్టేజ్ షోలు, వీధి నాటకాలు ప్రదర్శించే వారికి భారీగా ప్రభుత్వ సొమ్మును విడుదల చేస్తున్నారు. వీరు చేసే పని ఒక్కటే జగన్ జయకేతనం పేరుతో పద్యాలను పాడుతూ నాటకాలను ప్రదర్శించాలట.అందుకు గాను ఏపీ ప్రభుత్వం తాజాగా ఐదు లక్షల రూపాయలను విడుదల చేస్తూ జీవో ఒకటి విడుదల చేసింది. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తమ భజన చేసి భక్తి చాటుకొంటే ప్రజల సొమ్మును ధారపోస్తారా? అంటూ ఇటు ప్రజలు అటు రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే... ఈ నాటకాలు గత ఏడాదే ప్రదర్శించినట్లుగా జీవోలో పేర్కొనడం. అంటే గత ఏడాది నవంబర్ నెలలో తొమ్మిది రోజుల పాటు జగన్ జయకేతనం అనే పేరుతో పద్యనాటకాలను ప్రదర్శించారని అందుకే ఆ బృందానికి ఐదు లక్షల రూపాయలను మొన్న 13 వ తేదీన విడుదల చేసినట్లుగా జీవోలో పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు మీ భజన చేస్తే ఐదు లక్షల నజరానానా? ఇదెక్కడి చోద్యం మహారాజా అంటూ సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.నిజానికి అప్పట్లో మహారాజులు, ప్రభువులు, రాజ్యాలు, కొలువులు ఉన్న సమయంలో మహారాజా వారిని ఇలానే కవులు, కళాకారులూ, నృత్యకారులు తమ కళలతో అలరించి పరవశింపజేస్తే మహారాజా వారు వారికి కానుకను, బహుమతులు ఇచ్చేవారు. సరిగ్గా ఇప్పుడు ఏపీలో కూడా అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ నాటకాలను ప్రదర్శిస్తే ఏపీ సాంస్కృతిక శాఖ వారికి భారీ నజరానాలు ఇస్తుంది.ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించడం మంచిదే. నోటి మాట ద్వారా చెప్పలేనివి కూడా కళల ద్వారా విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే సత్తా కళలకే ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉద్యమం సమయంలో దోహదపడిన కళాకారులను ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పరిధిలోకి తీసుకొని వారి సేవలను ఉపయోగించుకుంటుంది. అందుకు గాను వారికి వేతనాలను కూడా చెల్లిస్తుంది.దేశంలో చాలా రాష్టాలలో కూడా కళాకారుల సేవలను ఉపయోగించుకుంటారు. అయితే అదంతా ప్రజా కార్యక్రమాలకు.. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు.. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపే కార్యక్రమాలను చేపట్టినందుకు.. మూఢ నమ్మకాలను పారద్రోలినందుకు ఆయా ప్రభుత్వాలు కళాకారులకు.. కొన్ని సంస్ధలకు  వేతనాలు.. బహుమానాలు ఇస్తున్నాయి.అయితే ఏపీలో మాత్రం జగన్ జయకేతనం పేరుతో కేవలం జగన్నామస్మరణతో వీధి నాటకాలలో ఆయనను వీరుడిగా సూరుడిగా పొగిడినందుకే ఈ నజరానాలు ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది. అది కూడా కేవలం తొమ్మిది రోజులకు ఐదు లక్షలు అంటే ఆ సొమ్ముతో ఎన్నో ప్రభుత్వ పథకాలను ఎంతో విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం సీఎం భజనకే ఆ ఖర్చు పెట్టేసింది.మొత్తం అచ్చం అప్పట్లో రాజరికపు ప్రభువులు, మహారాజుల కొలువులో భజనలతో మైమరిపించిన వారికి ఇచ్చే మాదిరే ఇక్కడ జీవోలు ఇచ్చేయడం అటు మేధావులను కూడా విస్తుపోయేలా చేస్తుంది. ఇప్పటికే గతంలో సీఎం హైదరాబాద్ నివాసానికి మరమ్మత్తులకు కూడా ఏపీ ఖజానా నుండి భారీగా కేటాయింపులు చేయడం వంటి వివాదాస్పద జీవోల విమర్శలు తెలిసినా కూడా ప్రభుత్వం ఇంకా ఈ తరహా పోకడలను మార్చుకోలేకపోవడం విశేషం!

Related Posts