మళ్లీ రాజకీయ చట్రంపై చిరు
హైద్రాబాద్, మే 18,
చిరంజీవి సినీ పరిశ్రమలో చిన్న నటుడుగా ప్రవేశించి మెగాస్టార్ అయ్యారు. తమ్ముళ్ళను కూడా తనతో పాటే ముందుకు నడిపించి తనంతటి వారికి చేశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినీ సీమలో ప్రవేశించి అ తరువాత అన్నతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆవేశం పాలు ఎక్కువ ఉండడం, మొహమాటాలకు పెద్దగా పోకుండా ఉండడం వంటివాటి వల్ల దూకుడుగా తాను రాజకీయం చేయవచ్చునని పవన్ అనుకున్నారు. అన్న ఓడిన చోట తాను గెలుస్తానంటూ జనసేన పార్టీ పెట్టారు. అయితే అన్న కంటే కూడా దారుణమైన ఫలితాలను 2019 ఎన్నికల్లో సాధించారు. అయితే పొత్తుల ఎత్తులతోనైనా అధికారానికి చేరువ కావాలని పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.ఇక చిరంజీవి సంగతి చూసుకుంటే ఆయన తన ఒంటికి రాజకీయాలు పడవని భావించి 2018లో హుందాగా తప్పుకున్నారు. నిజానికి మెగాస్టార్ కి వర్తమాన రాజకీయాలు రోతగానే కనిపిస్తున్నాయి. ఒకటి అనడం నాలుగు పడడం ఆయనకు అసలు కుదిరే పని కాదు, ఇక సినిమాల్లో వచ్చిన మంచి పేరునే కాపాడుకుంటూ అక్కడే పూర్తిగా ఉండాలని చిరంజీవి స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారు. అయితే ఆయన రాజకీయం వదిలే సినా ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది. అది వదలను అంటోంది. తమ్ముడు పార్టీ పెట్టాడు, ఇంకో తమ్ముడు ఎంపీగా పోటీ చేశాడు. అందువల్ల చిరంజీవికి ఈ రాజకీయ బాధ తప్పడంలేదుట.ఇక చిరంజీవికి తనకంటూ సొంత అభిప్రాయలు ఉండొచ్చు. ఆయనకు ఒక నాయకుడు నచ్చవచ్చు. మరొకరు నచ్చకపోవచ్చు. అయితే జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన విషయంలో మద్దతుగా మాట్లాడిన చిరంజీవి బాగా ఇరకాటంలో పడిపోయారు. దాన్ని పవన్ జనసేనానిగా గట్టిగా వ్యతిరేకించారు. ఇలాంటి గందరగోళం మధ్య చిరంజీవి తమ్ముడికి జై అనేయడం విశేషం. ఈ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవి ఇంట్లో తన తమ్ముడు పార్టీ ఉండగా తామంతా మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అనేశారు. అంటే తమ ఇంట్లో రెండవ పార్టీకి చోటు లేదని చెప్పేశారు. ఆ విధంగా తన రాజకీయం ముగిసినా కూడా చిరంజీవి తమ్ముడి పార్టీకి మొగ్గు అని చెప్పుకోవాల్సివచ్చింది.ఇది చిరంజీవి అభిప్రాయంగా ఉంటే ఆయన తమ జనసేనలో చేరినా చేరవచ్చు, భవిష్యత్తు ఎవరు చెప్పగలరు అని పెద్ద తమ్ముడు, సినీ నటుడు నాగేంద్రబాబు అంటున్నారు. అంటే జనసేనలో మెగాస్టార్ చేరుతారా? అని మీడియా అడిగిన దానికి ఆయన బదులిస్తూ ఇప్పటికైతే ఆయన రాజకీయాల్లో లేరు, సినిమాల్లో మాత్రమే ఉన్నారు. రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ అక్కడికి కామా పెట్టేశారు. మొత్తం మీద చూస్తే మెల్లగా మెగాస్టార్ ని జనసేన వైపు నడిపించే కార్యక్రమం తెరవెనక జరుగుతోందనుకోవాలి. చిరంజీవి కూడా తమ్ముడి పార్టీ వైపు అసక్తి చూపించడంతో ఇక ఆయన పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయిఅయితే చిరంజీవి చేరినా చేరకపోయినా ఆయన పేరు వాడుకుంటే జనసేనకు పెద్ద అసెట్. ఎందుకంటే ఇప్పటికీ మెగాస్టార్ కి దండిగా అభిమానులు ఉన్నారు. ఆయన జనసేనలో చేరనక్కరలేదు. ఎన్నికల వేళ జనసేనకు అనుకూలంగా ట్వీట్లు చేసినా వీడియో మేసేజులు ఇచ్చినా ఆ ఇంపాక్టు ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇది చాలదూ అనుకుంటే ముగ్గురు అన్నదమ్ములూ ఏకంగా రాజకీయ వేదిక మీద కనిపించి అయినా జనసేనకు కొత్త బలాన్ని తెచ్చేలాగా సీన్ కనిపిస్తోంది. ఏది ఏమైనా మెగాస్టార్ రాజకీయానికి ఇప్పటికి అయితే ఫుల్ స్టాప్ పడలేదు జస్ట్ కామాయే పెట్టారని అనే చెప్పాలేమో.