కరోనా వైరస్ దెబ్బకు..కుప్పకూలిన జపాన్ ఆర్థిక వ్యవస్థ
న్యూ ఢిల్లీ మే 18
కరోనా వైరస్ దెబ్బకు .. జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. జపాన్‌ది మూడవ స్థానం. అయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో.. గత ఏడాదితో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3.4 శాతం కుప్‌చకూలినట్లు తెలుస్తోంది. 2015 తర్వాత ఇదే అతిపెద్ద కుదుపు. కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచదేశాల్లో దాదాపు 8.8 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. వారం క్రితం, జర్మనీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. వాస్తవానికి జపాన్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించలేదు. కానీ ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ అమలు చేశారు. దీంతో అక్కడ వ్యాపారాలు నిలిచిపోయాయి. జీడీపీలో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 3.4 శాతం నష్టంతో పాటు గత ఏడాది చివరి క్వార్టర్‌లో 6.4 శాతం నష్టం వల్ల .. సాంకేతికంగా జపాన్ సంక్షోభంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 39 జిల్లాల్లో ఎమర్జెన్సీ ఎత్తివేసినా.. ఆర్థిక గమనం మాత్రం ఆశించినంతంగా కనిపించడంలేదు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య జపాన్ ఆర్థిక వ్యవస్థ 22 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు జపాన్ ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వరుసగా రెండవ నెల కూడా కొన్ని ఉద్దీపన సూచనలు చేసింది. ఈనెల చివరలో రెండవ బడ్జెట్ ఉంటుందని ప్రధాని షింజో అబే తెలిపారు.