ఆటోమోబైల్స్ షాపుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి
రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు సూచన
హైదరాబాద్ మే 18
ప్రభుత్వం సూచించిన మార్గ నిర్ధేశకాలను తప్పక పాటించే విధంగా ఆటోమోబైల్స్ షాప్స్ యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ధేశాల మేరకు అందుబాటులోకి వచ్చిన ఆటోమోబైల్ షాపులకు విచ్చేసే వినియోగదారులతో పాటు షోరూంల యాజమాన్యాలు, సిబ్బంది సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.ఈ సందర్భంగా ఆయన ఆటోమోబైల్స్ యాజమాన్యాలకు, సిబ్బందికి, వినియోగదారులకు పలు సూచనలు చేశారు.ప్రభుత్వ ఆదేశాలతో పాటు భాగ్యనగరంలో జి.హెచ్.ఎం.సి, జిల్లాలోని మున్సిపల్ అధికార యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగం సూచించిన నిబంధనల్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.వాహనాలు, విడిభాగాల కొనుగోళ్ల సమయంలో దగ్గర దగ్గరగా ఉండకుండా భౌతిక దూరంతో పాటు ప్రభుత్వం సూచించిన అన్ని మార్గ నిర్ధేశాలను పాటించడం తప్పని సరి అన్నారు.అలాగే, షోరూమ్‌ల వద్ద, విడిభాగాలు అమ్మే దుకాణాల వద్ద అందరూ శానిటైజర్స్, మాస్కులను తప్పని సరిగా వాడాలని ఆయన కోరారు.ఆటోమోబైల్స్ యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలతో పాటు కరోనా నియంత్రణ నిబంధనల్ని తూ.చ తప్పకుండా పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.ఇప్పటికే తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాలన్నీ పని చేస్తుండంటంతో కరోనా వ్యాప్తి కట్టడికై పకడ్భందీ చర్యలతో సేవలు అందించడం జరుగుతోందన్నారు.కరోనా నివారణ, నియంత్రణకై ఆర్టీఏ కార్యాలయాలు, చెక్ పోస్టులు, యూనిట్ ఆఫీసులలోనూ ప్రభుత్వ నిబంధనల్ని తప్పక పాటిస్తున్నట్లు చెప్పారు.ఆర్టీఏ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది, ఉద్యోగులు శానిటైజర్, మాస్కులను విధిగా ధరిస్తున్నారని తెలిపారు.