రోడ్డున పడ్డ మత్తు డాక్టర్
విశాఖపట్టణం, మే 19,
కాదేదీ అనర్హం అన్నట్లుగా తెలుగుదేశం రాజకీయం ఉంది. ఆ పార్టీ వర్తమానం ఎలా ఉందంటే మద్యం ప్రభావానికి లోనై తనని తాను మరచి ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఓ మత్తు డాక్టర్ సుధాకర్ ని కూడా తన రాజకీయ మనుగడకు ఊపిరిగా ఉపయోగించుకోవడమే గరిష్ట పతనం అంటున్నారు. నిజానికి విశాఖ పోలీసులకు అరెస్ట్ చేసేవరకూ ఆయన నర్శీపట్నం లో పనిచేసే మత్తు డాక్టర్ అని కూడా తెలియదు అని విశాఖ ఎస్పీ వివరించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ మత్తు డాక్టర్ తెలుగుదేశం పార్టీ అభిమాని అని తాజాగా వైసీపీ నేతలు చెబుతున్నారు. దానికి తగిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు.ఈ డాక్టర్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. అంతే కాదు, నర్శీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు అత్యంత సన్నిహితుడుగా ఉంటారని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చెబుతున్నారు. పైగా ఈ డాక్టర్ గారు 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ కోసం టీడీపీకి సుధాకర్ దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా ఆయన 2019లోనే చేసి మరీ వైద్య విద్యాపరిషత్ కి పంపించేశారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో రాజీనామాను ఆమోదించలేదు. దాంతో ఆయన ఉద్యోగం నాడు అలా నిలబడింది.ఇక సుధాకర్ కు టికెట్ రాకపోవడానికి కారణం కూడా విశాఖ జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ పోరు వల్లనేనని అంటున్నారు. నాడు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేది, ఇపుడు కూడా సన్నివేశంలో తేడా ఏమీ లేదు. అయితే నాడు అయ్యన్న ద్వారా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డాక్టర్ సుధాకర్ కి సొంత పార్టీ నుంచే బ్రేకులు పడడంతో ఎమ్మెల్యే టికెట్ రాలేదు. ఒక వేళ వచ్చి ఉంటే పోటీ చేసేవారు. ఆ విధంగా పూర్తి స్థాయి రాజకీయ నేతగా ఉండే చాన్స్ ఆయనకు పోయింది. అయితే తనలోని పార్టీ అభిమానాన్ని ఎపుడూ దాచుకోకుండా వ్యక్తం చేసే డాక్టర్ సుధాకర్ మాస్కుల వ్యవహరంలో కూడా ప్రభుత్వాన్ని దారుణమైన పదజాలంలో మాట్లాడి అవమానించారు. ఇది వీడియోల సాక్షిగా రికార్డు అయింది కూడా వైసిపీ నేతలు చెబుతున్నారు.ఇదిలా ఉండగా మత్తు డాక్టర్ సుధాకర్ వీధి గలాటా విషయంలో ఆదరాబాదరాగా మద్దతు ఇచ్చి టీడీపీ ఇరుకున పడిందా. అందుకే ఆ పార్టీ పెద్దలు మరో కొత్త ఆరోపణలతో ముందుకు వస్తున్నారు అంటున్నారు. వారం రోజుల నుంచి డాక్టర్ సుధాకర్ ని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఆ సంగతి ఆయన చెప్పలేదు, ప్రభుత్వం మీద ఎన్నో ఆరోపణలు చేసిన మత్తు డాక్టర్ సుధాకర్ చెప్పని విషయాలు ఇపుడు పచ్చ తమ్ముళ్ళు చెప్పి కధను కొత్త మలుపునకు తీసుకొస్తున్నారని అంటున్నారు. నిజానికి ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే నాడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఆ డాక్టర్ని రాజకీయంగా బలి చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తన స్వార్ధ రాజకీయం కోసం వాడుకోవడం వల్ల ఆయన బంగారం లాంటి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయి ఇపుడు ఇలాంటి స్థితిలో పడ్డారని అంటున్నారు. మొత్తానికి ఇంత జరిగినా ఆ డాక్టర్ సుధాకర్ కి మద్దతుగా వైద్య వర్గాల నుంచి ఒక్క ప్రకటన రాకపోవడం చూస్తూంటే వెనక ఉన్నది కచ్చితంగా పచ్చ రాజకీయమేనని అర్ధమయ్యే వారంతా సైలెంట్ అయ్యారని అంటున్నారు. చూడాలి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో.