YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి 50 నియోజకవర్గాల్లో నేతలు కావలెను

టీడీపీకి 50 నియోజకవర్గాల్లో నేతలు కావలెను

టీడీపీకి 50 నియోజకవర్గాల్లో నేతలు కావలెను
విజయవాడ, మే 19
ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నేత‌లు ఖాళీ అవుతున్న ప‌రిస్థితి పార్టీని తీవ్ర ఇర‌కాటంలోకి నెడుతోంది. అదేస‌మ‌యంలో నాయ‌కుల కొర‌త కూడా పార్టీని వెంటాడుతోంది. మేం నాయ‌కుల‌ను త‌యారు చేస్తాం.. టీడీపీ ఓ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ -అంటూ.. గ‌తంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప‌దేప‌దే చెప్పుకొనే వారు. అయితే, ఇప్పుడు ఈ ఇండ‌స్ట్రీలో నాయ‌కులు త‌యారు కావ‌డం లేదు. పై గా ఉన్నవారే త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నాయ‌కులు లేని నియోజ‌క‌వ‌ర్గాలుగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.చిత్రం ఏంటంటే ఇప్పుడున్న నాయ‌కుల్లో ప‌లు చోట్ల సీనియ‌ర్ మోస్ట్ నేత‌లు ఉన్నారు. వీరు ఇక‌, రిటై ర్మెంట్‌కు చేరువ‌లో ఉన్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా నేత‌ల లేమితో ఇబ్బంది ప‌డుతు న్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్రకాశం జిల్లా చీరాల‌లో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రాం టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అస‌లే సీటే రాద‌నుకున్న ఆయ‌న‌కు చంద్రబాబు ఎంతో సంక్లిష్ట ప‌రిస్థితుల్లో చీరాల సీటు ఇచ్చారు. అయితే, ఆయ‌న ఇటీవ‌ల జ‌గ‌న్‌కు మ‌ద్దతు ప్రక‌టించారు. పోనీ.. ఇక్కడ నుంచి గ‌తంలో ఓడిన పోతుల సునీత అయినా పార్టీలో ఉన్నారా? అంటే.. ఆమె కూడా ఇటీవ‌ల మండ‌లిలో వైసీపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించి దూర‌మ‌య్యారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి నేత త‌క్షణావ‌సరం.కృష్ణాజిల్లా గ‌న్నవ‌రంలో గెలిచిన వంశీ స్థానంలో స‌రైన నాయ‌కుడు ఇప్పటి వ‌రకు పార్టీకి ల‌భించ‌లేదు. ఇక‌, గుంటూరులోని వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలోనూఇదే ప‌రిస్థితి ఉంది. ఇక్కడ గెలిచిన మ‌ద్దాలి గిరి త‌ర్వాత వైసీపీకి మ‌ద్దతు ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ జెండా మోసేవారు క‌రువ‌య్యారు. ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి మృతి చెందారు. దీంతో ఇక్కడా నాయ‌కుడు లేరు. ఆయ‌న సోద‌రుడికి బాధ్యత‌లు ఇచ్చినా ఆయ‌న అంత దూకుడుగా ఉండ‌డం లేదు. క‌డ‌ప‌లో దాదాపు టీడీపీ నాయ‌కులు అంద‌రూ సీట్లు ఖాళీ చేశారు. ఫ‌లితంగా జిల్లా మొత్తంగా నాయ‌కులు అవ‌స‌రం ఉన్నారు. ఇంకా చెప్పాలంటే క‌డ‌ప జిల్లాలో రెండు ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లలోనూ టీడీపీకి నేత‌లే లేని ప‌రిస్థితి.అదే స‌మ‌యంలో రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే బుచ్చయ్య ఉన్నప్పటికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌న‌ని చెప్పారు. మ‌రి ఇక్కడ కూడా నాయ‌కుడు కావాల్సిన అవ‌స‌రం ఉంది. తూర్పుగోదావ‌రి జిల్లాలో రంప‌చోడ‌వ‌రం, గ‌న్నవ‌రం, రాజోలు, అమ‌లాపురం అసెంబ్లీతో పాటు అమ‌లాపురం ఎంపీ స్థానం నుంచి పార్టీకి స‌రైన అభ్యర్థులే లేరు. ప్రత్తిపాడులోనూ ఇదే ప‌రిస్థితి.ఇక కృష్ణా జిల్లాలోని విజ‌య‌వాడ ప‌శ్చిమంలోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. గ‌తంలో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన నాగుల్ మీరా స్థానంలో జ‌లీల్‌ఖాన్‌ను నియ‌మించినా.. ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్యల‌తో దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడ కూడా నాయ‌క‌త్వ లేమి క‌నిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజాంలోనూ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి ఇప్పుడు పార్టీ మారాల‌నే దృష్టిలో ఉన్నారు.ఫ‌లితంగా ఇక్కడ కూడా టీడీపీకి నాయ‌కుడు కావాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నింటిక‌న్నా ముఖ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లా తునిలో య‌న‌మ‌ల సోద‌రుల‌పై తీవ్ర వ్యతిరేక‌త ఉంది. ఇక్కడ మాజీ మంత్రి..పార్టీలో కీల‌క‌నేత‌గా ఉన్న వ్యక్తే పార్టీని ప‌టిష్టం చేయ‌లేని ప‌రిస్థితి. తుని లాంటి చోట్లే పార్టీలోనే విభేదాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా య‌న‌మ‌ల సోద‌రుల‌ను త‌ప్పించి కొత్త నాయ‌కుడిని నియ‌మించాల‌నే డిమాండ్లు ఉన్నాయి. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్రమే.. వాస్తవంగా చూస్తే.. దాదాపు 50 కిపై గా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నేది నిజం. మ‌రి చంద్రబాబు ఎలా ? ముందుకు వెళ్తారో చూడాలి.

Related Posts