భారత్, చైనా మధ్య ఘర్షణ వాతావరణం
న్యూఢిల్లీ, మే 19,
మే నెల ప్రారంభంలో భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు సైన్యాలు బాహాబాహీ దిగి, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన విషయం తెలిసింది. అప్పటి నుంచి ఏర్పడిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనాలు తమ బలగాలను మోహరించాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. సైనిక బలగాల మోహరింపుతో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దెమ్‌చోక్, చుమార్, దౌలత్ బేగ్ ఓల్డై, గాల్వాన్ లోయ వద్ద బలగాలను మోహరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చైనా సైన్యం తొలుత ఓ నది వద్ద గుడారాలు వేసి, నిర్మాణాలు ప్రారంభించడంతో గాల్వాన్ లోయ వద్ద సైన్యాన్ని మోహరించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.దాదాపు రెండేళ్ల తర్వాత భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఇరు పక్షాలూ అక్కడికి అదనపు బలగాలను తరలించాయి. మే 6న ఉదయం ఇరు దేశాలకు చెందిన స్థానిక సైనికాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగిందని వెల్లడించారు. అయితే, గత శనివారం సిక్కిం సెక్టార్‌లోని ‘నాథులా పాస్’ వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ భారత్, చైనాకు చెందిన సుమారు 150 మంది సైనికులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. తాజాగా లద్ధాక్‌లో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.