YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వలస కూలీల దగ్గర్నుంచి వసూళ్లు

వలస కూలీల దగ్గర్నుంచి వసూళ్లు

వలస కూలీల దగ్గర్నుంచి వసూళ్లు
అనంతపురం, మే 19,
రోనా ప్రభావం ఎవరిపై ఎంత అన్నది లెక్కలు వేసేందుకు కొలమానాలు ఆ ప్రభుత్వాల వద్ద కూడా లేవు కానీ ఒక్క వలస కూలీల బతుకులు మాత్రం ఎన్నివిధాలుగా చితికి పోవచ్చో అన్ని విధాలుగా చిదిమేశారు. ముందుగా ఎలాంటి సూచనలు లేకుండా ఉన్నట్లుండి లాక్ డౌన్ ప్రకటించడంతో కొన్ని కోట్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వలస కూలీల వ్యధను వర్ణించేందుకు మాటలు కూడా సరిపోవు. లాక్ డౌన్ మొదలై రెండు నెలలు గడిచినా ఇప్పటికీ దారుల వెంట కన్నీటి గాధలే కనిపిస్తున్నాయి. నెత్తిన మూట.. చంకలో బిడ్డ.. కడుపులో మరో పిండం.. ముసలి ముతక అన్నది లేదు. అసలే నెత్తిన ఎర్రటి ఎండలు.. కాళ్ళకి సరైన చెప్పులు కూడా లేకపోయినా వందల కిమీ నడక.. ఏది ఏమైనా కన్న ఊరికి చేరితే గంజి తాగయినా బతుకుతాం. అందుకోసం కాళ్ళు బొబ్బలెక్కినా.. మార్గమధ్యన ప్రాణమే పోయినా దిక్కేలేదు. మార్గమధ్యన ఎవరైనా దాతలు దయతలిస్తే పట్టెడన్నం.. గుక్కుడు నీళ్లు... దూరం వందల కిమీ.. ఉన్నది దేవుడిచ్చిన రెండు కాళ్లే అయినా ఏదో తెలియని నిబ్బరం.. బహుశా అదేనేమో ఆత్మవిశ్వాసం అంటే. వారి తిప్పలు వాళ్ళవే.. వారి చావు వారిదే. అయినా ప్రభుత్వాలు ఇప్పటికీ వలస కూలీలను ఆదుకుంటామనే మాట సాగదీస్తూనే ఉన్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం అయితే వలస కార్మికుల పాలిట సీఎం జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నట్లుగా ప్రచారం చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా వలస కూలీలు కనిపిస్తే వారి స్వరాష్ట్రానికి తరలించే బాధ్యతను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని.. వారికి ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ సొంత రాష్ట్రంలో వదిలేలా చర్యలు తీసుకుంటున్నారని అనుకూల మీడియా ఊదరగొడుతుంది.రాష్ట్రంలో కనిపించే వలస కార్మికుల సంగతేమో రాష్ట్రంలోనే ఇన్నాళ్లుగా పనిచేసిన కార్మికుల వద్ద మాత్రం వారి సొంత రాష్ట్రానికి పంపేందుకు ముక్కుపిండి బస్సు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇదేదో ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణో.. గిట్టని వాళ్ళు చేసిన కుట్రనో కాదు ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ ఏపీ నుండి హైదరాబాద్ వరకు వలస కార్మికుల వద్ద నుండి మూడు బస్సులకు గాను లక్షా ఎనభై వేల రూపాయలను బలవంతంగా వసూలు చేసి బిల్ చేతిలో పెట్టింది.జమ్మూకాశ్మీర్ కి చెందిన వలసకూలీలు గత ఇరవై ఏళ్ళుగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జీవిస్తున్నారు. వీరంతా లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు. ఇన్నాళ్లు దాతలు, సంస్థల విరాళాలతో నెట్టుకొచ్చినా ఇకపై అవి కూడా ముతకబారిపోయాయి. దీంతో ఎలాగయినా స్వరాష్ట్రానికి వెళ్లిపోవాలని వాళ్లంతా నిర్ణయించుకున్నారు. శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే ఆ రైళ్లు ఏపీ నుండి లేవు. దీంతో వారంతా హైదరాబాద్ వచ్చి రైళ్లను అందుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం వారికి సరిపడా మూడు బస్సులను నడిపేందుకు బస్సుకు అరవై వేల చొప్పున మొత్తం లక్షా ఎనభై వేలు కట్టాలని నిర్ణయించింది. అవే ఉంటే వాళ్ళ బతుకులు అలా ఎందుకు మారేది. చివరికి స్థానిక ఎమ్మెల్యే వద్దకు కూడా విషయాన్ని తీసుకెళ్లినా లాభం లేకపోయింది.ఆర్టీసి సంస్థ డబ్బులు కడితేనే బస్సులు కదిలేది అని తెగేసి చెప్పడంతో స్థానిక వ్యాపార వేత్తలైన రామ్-లక్ష్మణ్ అనే వాళ్ళు ముందుకొచ్చి ఆ డబ్బు కట్టారు. అప్పు రూపంలో కాశ్మీరీలకు డబ్బును ఇచ్చిన ఆ అన్నదమ్ములు వారు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకేటేనని వారు క్షేమంగా వెళ్తే అదే చాలంటుండగా ఆర్టీసి మాత్రం ఒక్క రూపాయి లెక్క తక్కువ కాకుండా కిమీ ప్రకారం లెక్కకట్టి బిల్ వేసింది.తమకి సహాయం చేసిన ప్రతిఒక్కరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని.. తమ ఊరికి వెళ్ళాక ఉన్నది అమ్ముకొని అయినా ప్రతిపైసా తిరిగి చెల్లిస్తామని షేఖ్ తారీఖ్ అనే వలస కార్మికుడు బోరున విలపిస్తూ వెల్లడించాడు. ఇక ఏపీ ప్రభుత్వం వారి నుండి డబ్బు కట్టించుకొని ఇచ్చిన రసీదు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతం ప్రచారం కావడంతో నెటిజన్లు ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు

Related Posts