యాదాద్రిలో ఆర్టీసీ సేవలు షురూ
యాదాద్రి భువనగిరి మే 19
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్డ్రవ్యాప్తంగా ఆర్డీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించటంతో ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడితో సికింద్రాబాద్ బయలుదేరింది ఆర్టీసీ బస్సు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో మరికొన్ని బస్సులు వివిధ ప్రాంతాలకు ఖాళీగా వెళ్లాయి. యాదగిరిగుట్ట నుంచి వివిధ ప్రాంతాలకు 50% బస్సులను నడపడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు డిపో మేనేజర్ రఘు. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ బస్సులు నడపాలని ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు డీఎం. బస్సులో ప్రయాణించాలనుకున్న వ్యక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నిన్న యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో బస్సుల ఫిట్ నెస్ ను పరీక్షించిన అధికారులు, బస్సులను కెమికల్ తో శానిటైజ్ చేశారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా సీట్లకు మార్కింగ్ చేశారు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా బస్టాండ్ లో కూరగాయలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేయడంతో.. ఆ దుకాణాలను తొలగించి బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేసి కెమికల్ తో పూర్తిగా శానిటైజ్ చేశారు. అలాగే ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు