ఆగస్టు 3 తర్వాత స్కూల్స్
విజయవాడ, మే 19,
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా, లాక్‌డౌన్ కారణంగా మూత పడిన స్కూళ్లు ఆగస్టు 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని, కలెకర్ట్‌లు అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు.తొమ్మిది రకాల సదుపాయలను అన్ని స్కూళ్లలో కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశామన్నారు. జులై నెలాఖరు నాటికి అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలని.. ఈ పనులపై కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సీఎం కోరారు.పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే సెప్టెంబర్ 25న వైఎస్సాఆర్ విద్యా దీవెన, ఆగస్టు19న వైఎస్సార్ వసతి దీవెన పథకం కింద నిధులు జమ చేయనున్నట్లు కూడా తెలిపారు.