చితికిపోతున్న చిన్న వ్యాపారులు
శ్రీకాకుళం, మే 20
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా చిరు వ్యాపారుల జీవనాధారం అగమ్యగోచరంగా మారింది. ఎంతోమంది చిరు బతుకులు రోడ్డున పడ్డాయి. పురుషునితో సమానంగా కష్టపడితే గానీ అతి కష్టంగా సాగే కుటుంబ పోషణకు మహిళలు తన వంతు బాధ్యతగా కూరగాయలు, పండ్లు, చేపలు, కొబ్బరికాయలు వంటి పలు రకాల చిరు వ్యాపారులను చేస్తున్నారు. సాధారణ రోజుల్లో వారు పడిన కష్టానికి పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ సుమారు రూ.300 నుంచి రూ.350 వరకు మిగిలేది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించడంతో వ్యాపారాలు సాగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడమే తప్ప లాభాలు ఉండడంలేదని చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మకాలకు సమయం తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా వారు చెబుతున్నారు. మగవారికి పనులు లేక పోవడంతో దినసరి ఆదాయం లేక ఇంటిల్లిపాది కూర్చొని తినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై నూడిల్స్, పానీ పూరి, సరబత్, టీ, లస్సీ, పకోడీ తదితర చిరుతిండ్లు వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ వ్యాపారాలు ఎక్కువగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సాగేవి కావడంతో పూర్తిగా మూతపడి నట్లయింది. దీంతో బతుకు భారమై నేల చూపులు చూసే పరిస్థితి వచ్చింది. సామాజిక స్పృహతో పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు సమయానుకూలంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నప్పటికీ అది అంతా తాత్కాలికమేనని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందిస్తే తప్ప వారు కోలుకునే పరిస్థితి కానరావడంలేదు. కరోనా వ్యాప్తి మరణాల కన్నా ఆర్థిక ఇబ్బందులతో ఆకలి చావులే అధికమయ్యేటట్లుగా కనిపిస్తున్నాయని పలువురి నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది.