ప్రకాశం జిల్లాలో కబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. హౌసింగ్ కాలనీలు నిర్మించాలని ఉడా నిర్ణయించడంతో.. ఇదే అదనుగా కొందరు నాయకులు పేదల భూములు కొట్టేయడానికి పెద్ద పథకమే వేశారు. పలు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు జనాభా పెరగడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి..ఉడా ప్రకటనతో అక్రమార్కులు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. ఎకరానికి 10 లక్షలు చెల్లిస్తామని కోతలు కోశారు. చివరకు లక్ష చొప్పున చెల్లించి 236 మంది రైతుల నుంచి 280 ఎకరాలకు సంభందించిన పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. ఇది మరో నాయకుడి తీరు. పేదలకు ఇచ్చిన ప్రభుత్వం భూములను కొనుగోలు చేయడం, వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, మళ్లీ ఆ డబ్బుతో భూములు కొనడం పరిపాటిగా మారింది. మొదట 48 ఎకరాల పేదల భూములను కొనుగోలు చేశారు. వీటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఇంతటితో ఆగకుండా పలుగ్రామాల్లోని ప్రభుత్వ భూములను కొందరి పేరిట అక్రమంగా ఆన్‌లైన్ చేయించారు. ఇటీవల ‘ఈనాడు’ కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని భూములను తొలగించారు. అయినా వీటిపై మార్కాపురంలోని నాలుగు ప్రైవేటు బ్యాంకులతోపాటు.. సానివరం, దూపాడు, పెద్దారవీడులోని పలుబ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకున్నారు. గత ఏడాది మార్కాపురంలో ప్రారంభమైన ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ పలుకుబడిని ఉపయోగించి కేవలం అక్రమంగా పొందిన ప్రభుత్వ భూములపైనే భారీగా రుణాలు తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రూ. 14 లక్షలు తీసుకున్నట్లు ఉండగా, అనధికారికంగా రూ. 60 లక్షలకు పైగా ఉంటాయని సమాచారం. వ్యవసాయ రుణాల పేరుతో తక్కువ వడ్డీకే రూ. లక్షల రుణాలు తీసుకున్నారు. ఈ నిధులతో మరికొన్ని పట్టా భూములను కొని వాటిపైనా రుణాలు తీసుకున్నారు. ఇలా ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి, బ్యాంకుల్లో పెట్టి తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవడం ఓ నాయకుడి దందాగా నడుస్తోంది.మండలంలో ఓ నాయకుడు స్థానికంగా దాదాపు 64 ఎకరాల భూమిని అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించారు. గత ఏడాది కాలంలోనే ఇవన్నీ పేర్లు మారిపోయాయి. మండలంలోని తోకపల్లి, తంగిరాలపల్లి, కంభంపాడు గ్రామాల్లోని చెరువు, పశువులబీడు, దేవాదాయశాఖకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిలో దాదాపు 64 ఎకరాలు వీరి బంధువుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. వీటిపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈ భూముల విలువ దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. గతంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులకు తెలిసే ఈ తంతంగం జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ పథకాలను కూడా నాయకులు వదలడం లేదు. మండలంలోని మల్లవరం, సుంకేసుల తదితర గ్రామాల్లో దాదాపు 800 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మల్లవరంలో గతంలో నిర్మించిన లబ్ధిదారులకు, అసలు నిర్మాణాలు చేయని వారికి బిల్లులు ఇచ్చినట్లు చూపి కాజేశారు. ముంపు గ్రామం సుంకేసులలో ఇటీవల మరుగుదొడ్ల నిర్మాణాలకు కలెక్టరు అనుమతిచ్చారు. దీనిలోనూ ఆ నాయకులు చిలక్కొట్టుడు ప్రారంభించారు. నిర్మాణ సంఖ్యను అధికంగా చూపి బిల్లులు తీసుకున్నారు. వివిధ సంక్షేమశాఖల పరిధిలోని రుణాల మంజూరుకూ వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఏమీ చేయలేని పరిస్థితి. పార్టీపరంగా ఫిర్యాదు అందడంలో అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.