YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ యాంటి సెంటిమెంట్ పనిచేస్తుందా

 జగన్ యాంటి సెంటిమెంట్ పనిచేస్తుందా
 జగన్ యాంటి సెంటిమెంట్ పనిచేస్తుందా
విజయవాడ, మే 21,
ఇంటిలో కొత్త కోడలు అడుగు పెడితే మంచి జరిగినపుడు మహలక్ష్మి అంటారు. అదే చేటు జరిగితే జేష్ట లక్ష్మి అంటారు. ఈ సెంటిమెంట్ అన్ని రంగాల్లోనూ ఉంది. రాజకీయ రంగాల్లో సెంటిమెంట్లకు కొదవ లేదు. ఇపుడు జగన్ విషయంలో ఆయన్ని ప్రతీ రోజూ విమర్శించే టీడీపీ యాంటి సెంటిమెంట్ పూత పూయాలని చూస్తున్నట్లుగా సీన్ కనిపిస్తోంది. జగన్ అడుగు పెట్టారు పిడుగు పడింది, పచ్చని ఏపీలో చిచ్చు మొదలైంది అని ఎప్పటికపుడు పచ్చ పార్టీ గొంతు చించుకుంటున్న సంగతి తెలిసిందే. దానికి కాస్తా మసాలా, తాళింపు వేసి మరీ జనం దృష్టిలో జగన్ ని ఐరన్ లెగ్గుగా మార్చే వ్యూహం ఒకటి తయారవుతోంది అంటున్నారు.నిజానికి జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఏపీలో ఎన్నో పరిణామాలు జరిగాయి.అందులో కొన్ని పాలనాపరమైన విధానాల కారణంగా. మరికొన్ని ప్రకృతిపరంగా, ఇంకొన్ని రాజకీయపరంగా ఉన్నాయి. మరికొన్ని అనూహ్యమైనవి ఉన్నాయి. అయితే అన్నీ ముడిపెట్టేస్తూ జగన్ ఖాతాలో వేయడానికి టీడీపీ తెర వెనక భారీ కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ వచ్చాకా పేదవాడు చచ్చిపోయాడు అంటున్నారు తమ్ముళ్ళు, ఇలా ఒక విషాద నినాదం ఇవ్వడానికి జగన్ కి ఐరన్ లెగ్ ట్యాగ్ తగిలించడానికి మధ్య బోలెడంత లింక్ ఉందన్నమాట.జగన్ ఇసుక పాలసీ విషయంలో తీసుకున్న జాప్యం మూలంగా గత ఏడాది ఆరు నెలల పాటు భవన నిర్మాణ కార్మికులు వీధుల పాలు అయ్యారు. అపుడు వారు ఆకలితో అలమటించారని, ఇపుడు కరోనాతో పనిలేక కడుపు కాలి చస్తున్నారని సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు. అలాగే జగన్ మూడు రాజధానుల ముచ్చటతో పచ్చని రైతులు రోడ్డు మీదకు వచ్చారని కూడా అంటున్నారు. ఇక జగన్ మధ్యపాన నిషేధం అంటూ చెప్పి రేట్లు పెంచేసి ఎన్నో జీవితాలను తల్లకిందులు చేశారట. ఇది కూడా సోషల్ మీడియాలో రచ్చగానే ఉంది.ఎన్నడూ లేనిది ప్రపంచానికి కరోనా వస్తే అది కూడా జగన్ పుణ్యమేనని చెప్పే తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇప్పటిదాకా మానవాళి ఎరుగునా. ఇంతకు ముందు ఇలా జరిగిందా అని తమ్ముళ్ళు అంటున్నారంటే వారు చూపు, వేళ్ళూ జగన్ వైపే ఉన్నాయని అంటున్నారు. ఇక విశాఖలోని పాలిమార్స్ లో విషవాయువు లీక్ ఇచ్చేసి పన్నెండు మంది దుర్మరణం పాలు అయినా, వందలాది మంది జీవచ్చవాలు అయినా కూడా అది జగన్ వల్లనేనట. అలాగే ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదం జరిగి వలస కూలీలు చనిపోయినా జగన్ వల్లేనని అనేట్లుగా టీడీపీ రాజకీయం సాగుతోంది. దీని మీద చంద్రబాబు ట్వీట్ చేస్తూ ఏపీలో వరస ప్రమాదాలు మనసు కలచివేస్తున్నాయని అనడం విశేషం. మరి కరోనాతో జనం అల్లాడుతున్నారు. అలాగే ఆకలి బాధ కూడా ఎక్కువగా ఉంది. దీంతో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు జగనే అన్నింటికీ పాపాల భైరవుడు అంటూ మసాలా జోడిస్తే ఐరన్ లెగ్ ట్యాగ్ పడిపోతుందేమో. మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా. జగన్ మరో చేత్తో పేదలకే కదా అన్ని రకలా పధకాలు ఇస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఖజానా టోటల్ గా తెచ్చి మరీ అంతా దోచిపెడుతున్నారు. ఇది వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్. చూడాలి జగన్ ని జనం ఎలా చూస్తారో.

Related Posts