YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇందురూలో కొత్త రాజకీయం

ఇందురూలో కొత్త రాజకీయం

ఇందురూలో కొత్త రాజకీయం
నిజామాబాద్, మే 21,
 ప్ర‌పంచం మొత్తం క‌రోనా క‌ష్ట‌కాలంలో ఉంటే నిజామాబాద్ జిల్లాలో మాత్రం రాజ‌కీయ నేత‌లు బిజీగా ఉన్నారు. వీరు లాక్‌డౌన్‌, క‌రోనాతో క‌ష్టాల్లో ఉన్న త‌మ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంలో బిజీగా ఉన్నార‌నుకుంటే పొర‌పాటే. వారు బిజీగా ఉన్న‌ది పార్టీలు మార‌డంలో. కొత్త పార్టీలో చేర‌డంలో. మాస్కులు క‌ట్టుకొని కండువాలో మార్చేస్తున్నారు. అధికార పార్టీల నేత‌లు ప‌క్క పార్టీకి చెందిన నేత‌ల‌ను చేర్చుకుంటూ క‌రోనా క‌ష్ట‌కాలంలో కొత్త రాజ‌కీయం మొద‌లుపెట్టారు. నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాలు ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర స‌మితికి కొంత ఇబ్బందిక‌రంగా మారాయి. ప్ర‌త్యేకించి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. వాస్త‌వానికి నిజామాబాద్‌లో బీజేపీకి సంస్థాగ‌తంగా కొంత ప‌ట్టుంది. ప్ర‌త్యేకించి నిజామాబాద్ న‌గ‌రంలో బీజేపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ధ‌ర్మ‌పురి అర్వింద్ చాలారోజులుగా ఎంపీ స్థానాన్ని టార్గెట్ చేసి ప‌ని చేయ‌డంతో ఆయ‌న క‌విత‌ను ఓడించి బీజేపీకి మ‌రింత ఉత్సాహం తెచ్చారు. క‌విత ఓట‌మి టీఆర్ఎస్‌కు చాలా ఒక పెద్ద షాక్ కాగా, నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌రో షాక్ ఇచ్చింది బీజేపీ. 60 డివిజ‌న్లు ఉన్న ఈ కార్పొరేష‌న్‌లో బీజేపీ 24 స్థానాల‌ను గెలుచుకొని అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఎంఐఎం 18 సీట్లు గెల‌వ‌గా, టీఆర్ఎస్ పార్టీ కేవ‌లం 15 సీట్లు మాత్ర‌మే గెలిచి మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యింది. అయితే, ఎంఐఎం, టీఆర్ఎస్ క‌లిసి కార్పొరేష‌న్ మేయ‌ర్‌గిరి ద‌క్కించుకున్నా అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ స‌త్తా చాటిన‌ట్లే చెప్పుకోవాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఉత్త‌ర తెలంగాణ‌లో నిజామాబాద్ జిల్లానే ఎక్కువ ఇబ్బందిక‌రంగా మారింది. జిల్లాలో బ‌లం త‌గ్గ‌కుండా మ‌రోసారి క‌విత‌ను నిజామాబాద్ జిల్లాకే ప‌రిమితం చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. ఆమెను స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపారు. క‌రోనా కార‌ణంగా ఈ ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. క‌విత‌కు పోటీగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాయి. టీఆర్ఎస్‌కే మెజారిటీ స్థానిక సంస్థ‌ల స‌భ్యులు ఉన్నందున‌ ‌ఈ రెండు పార్టీలు గ‌ట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఏమీ లేవు. అయినా, బీజేపీని దారుణంగా ఓడించి స‌త్తా చాటాల‌ని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి.ఇటీవ‌ల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నందిపేట్ జ‌డ్పీటీసీ, ఆమె భ‌ర్త బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేట‌ర్లు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గ‌ణేష్ గుప్తా ఆధ్వ‌ర్యంలో కండువా మార్చి టీఆర్ఎస్ గూటికి చేరారు.మ‌రి కొంత మంది బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేర‌బోతున్న‌ట్లు జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, టీఆర్ఎస్ అభివృద్ధి చూసి బీజేపీ వారు త‌మ పార్టీలో చేరుతున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లు చెప్పుకుంటున్నా ఇది చేరిక‌ల‌కు స‌రైన స‌మ‌య‌మేనా అనే ప్ర‌శ్న మొద‌లైంది. లాక్‌డౌన్ వేళ ఈ చేరిక‌ల రాజ‌కీయం ఏంట‌ని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది. మొత్తంగా బీజేపీకి ప‌ట్టున్న నిజామాబాద్ జిల్లాలో ఒక జ‌డ్పీటీసీ, ముగ్గురు కార్పొరేట‌ర్లు టీఆర్ఎస్‌లో చేర‌డం బీజేపీకి, ప్ర‌త్యేకించి ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు గ‌ట్టి షాక్ లాంటిదే అని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నిక వ‌ర‌కు మ‌రిన్ని ఫిరాయింపులు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల క‌విత భారీ మెజారిటీతో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

Related Posts