*వీరు నేడు కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి.*
*వీరే పూర్వాశ్రమంలో.... సాహిత్య, అవధాన, ఆశు కవితా, భువనవిజయ సామ్రాజ్యాలలో సమ్రాట్ గా వెలిగిన డాక్టర్ శ్రీ ప్రసాదరాయ కులపతిగారు. గుంటూరు హిందూ కాలేజ్ కులపతి/ Principal గా, తెలుగు ఉపన్యాసకులుగా విద్యార్థులను సన్మార్గంలో నడిపిన గురుదేవులు.*
*మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యోగాభ్యాసం,వ్యాయామం, ముష్టియుద్ధం, వెయిట్ లిఫ్టింగ్, అవధానం, ఆశుకవిత్వం... ఇలా బహువిద్యలలో అసమాన ప్రతిభామూర్తులైన దివ్య దీప్తులు వీరు.*
*ఇంతటి బహుముఖ ప్రజ్ఞా జ్ఞాన ఘనులైన పీఠాధిపతులు భారతదేశంలోనే వీరు తప్ప ఇంకెవరూ లేరన్నది పెద్దలమాట !!*
*వీరి ధారణ, సాధన అనన్య సామాన్యం. కొన్ని వేల పద్యాలు, శ్లోకాలు వీరి మస్తిష్కం లో నిక్షిప్తమై ఉంటాయి. వీరు అనేక దేవతల మంత్రాలను కొన్ని కోట్ల పర్యాయములు ఉపాసించారు.*
*వీరి ఉఛ్వాస నిశ్వాసలే మంత్రములు... మంత్రములే వీరి ఉఛ్వాస నిశ్వాసములు...*
*వీరిని చూస్తేనే? నడిచి వచ్చే మంత్రాధిదేవతలా.. తరలివచ్చే పూర్వమహాకవి సమూహముగా అనిపిస్తుంది..*
*వీరి పూర్వీకులూ అంతటి వారే! వీరి ముత్తాత శ్రీ పోతరాజు రామకవి. వీరు 20 కళలలో నిష్ణాతులు. సుప్రసిద్ధ కొప్పరపు సోదర కవులకు వీరే అవధాన గురువరేణ్యులు. కులపతి గారి పితామహ వంశం పోతరాజు వారు, మాతామహ వంశం కొప్పరపు వారు.*
*రెండు వంశములలో పూర్వులంతా మహా మంత్రులు,దండనాథులు, దివానులు, గ్రామాధికారులు, మహాకవులు.అందుకే? అటు కవిత్వము, ఇటు వ్యాయామము రెండింటి పట్ల ఆకర్షణ, అనురాగం, సాధన, ప్రజ్ఞ సహజసిద్ధంగా వీరికి వచ్చాయి.*
*వీటి సాధనలో వీరు ఎంచుకున్నది ఉపాసనా మార్గం. ఇందుకే, ఆ విద్యలు రక్తనిష్ఠమై,హృదయ కంజాతస్థమైనాయి.*
*బహుశా! తిక్కన, పెద్దన, తిమ్మరసు వంటి మహనీయులు ఈ కుటుంబాలకు ప్రేరణ అయిఉంటారు. తిక్కన కుటుంబీకులు దండనాధులుగా, మహా మంత్రులుగా, గ్రామాధికారులుగా చరిత్ర ప్రసిద్ధులు.*
*అల్లసాని పెద్దన శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధవ్యూహం, రణతంత్రంలో గురు దేవులుగా ఉండేవారు.*
*ఇక, తిమ్మరసు వారిది ఇక్కడి కొండవీడు ప్రాంతం నుండే వెళ్లిన కుటుంబం. రాయలవారి కుటుంబాలకు తండ్రి, గురువు, దైవము... అన్నీ తిమ్మరసు వారే అన్నది చరిత్ర లిఖితము.*
*ఇలా... ప్రసాదరాయ కులపతి గారి వంశాలపై వీరందరి ప్రభావం తప్పక ఉంటుంది.*
*కులపతి గారు మొట్టమొదటి అవధానం తన 15వ ఏట కొప్పరం లోనే చేశారు. ప్రఖ్యాత కొప్పరపు కవుల తమ్ముడు బుచ్చిరామయ్య గారి అధ్యక్షతలో జరిగింది. అలా మొదలైన వారి అవధానం అప్రతిహతంగా సాగింది.*
*కులపతి గారి గురుదేవులు శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు. వారి సూచనతో కులపతి గారు అవధానాలకు స్వస్తి చెప్పి, తెలుగులో M. A., Phd సంపూర్ణం చేశారు.*
*మహాకవి పోతన్న భాగవతం పై వీరి పరిశోధన జరిగింది. ఆ ఆశుకవితా ధోరణి ని, ఆ అవధాన విద్యామూలమైన ధారణను భువన విజయాలలో ప్రదర్శించి, పద్యానికి పట్టాభిషేకం చేశారు.*
*2002లో సన్యసించి, కుర్తాళ పీఠాధిపతులయ్యారు. పూర్వం శ్రీ మౌనస్వామి, శ్రీ విమలానంద భారతి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతి, శ్రీ శివ చిదానంద భారతి వంటి మహితాత్ములు అధిపతులు గా ఉన్న శ్రీ సిద్ధేశ్వరీ పీఠానికి వీరు నేడు అలంకృతులయ్యారు.*
*తమిళనాడులో తెలుగు స్వామి మౌనస్వామి 1916లో స్థాపించిన ఈ సిద్ధేశ్వరీ పీఠం.. నేటి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఏలుబడిలో.... ఆధ్యాత్మిక, సారస్వత , సంగీత సమలంకృతమై వేయి వెన్నెలలతో మేటి పీఠంగా వెలుగులీనుతోంది...*
*తిక్కన, పోతన, శ్రీనాథుడు, శ్రీ కావ్యకంఠ గణపతిముని, తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటి... మహా ఔపదేశిక, సహజ కవులే ప్రసాదరాయ కులపతి గారి కవన, ఉపాసనా జీవనానికి ప్రభావ మూర్తులు.*
*అవధాన, ఆశుకవిత్వం తో పాటు ఎన్నో మహాద్భుతమైన రచనలు చేసిన మహాకవి, మహా మనీషి, మహితాత్ముడు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి.*
*" కులపతి.. కులపతి.. మహాకవి దళపతి 'అని కీర్తిగాంచిన ఈ మహనీయునికి, మహా మంత్ర స్వరూపంగా భాసించే ఈ స్వాములవారికిి అక్షర సుమములతో అర్చన చేస్తున్నాను -*
*రోజుకు వెయ్యి నేల దండీలు, రెండు వేల బస్కీలు తీసేవారు. ఇనుప కడ్డీలను ఒంచేవారు. పెద్దపెద్ద రాళ్లను ఎత్తి పడేసేవారు. కొన్ని గంటలపాటు ఒకే యోగాసనంలో ఉండేవారు. ఇక యోగ సాధన అసామాన్యం. కొప్పరపు కవుల తర్వాత వీరంతటి వేగంగా పద్యాలు చెప్పే నేర్పుకలవారు లేనేలేరు. వారు పుస్తకాలు చదివి, 60 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ కొన్నివేల పద్యాలు, శ్లోకాలు వారి రసనాగ్రంపై నాట్యం చేస్తూ ఉంటాయి. 10వ తరగతి నుండి Phd. వరకూ వారే అగ్రస్థానం సాధించారు. 19 ఏళ్లకే కాలేజీలో Tutor అయ్యారు. ఇక వారిది కఠోరమైన మంత్రసాధన. ఇంతటి ప్రతిభ, శక్తి, సాధన, పట్టుదల ఉన్న ఈ స్వామివారిని మనం దర్శించుకోవడం, వారు ఉన్న కాలంలోనే మనమూ ఉండడం మహద్భాగ్యం... అని, నా భావన..*