వినియోగం ఎక్కువైతే ...విద్యుత్ బిల్లులు రావడం సహజం
- మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం మే 21
కరెంట్ బిల్లులు వాడుకున్నంతే వచ్చాయని, లాక్ డౌన్ సమయంలో ప్రజలు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతోనే బిల్లులు సహజంగానే వచ్చాయని జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతుందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రమయ్య ( నాని ) తేల్చిచెప్పారు. గురువారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి ఇబ్బందులను స్వయంగా కనుకొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని , పనులు లేకపోవడంతో తాము ఆ బిల్లులు చెల్లించలేమని ఆర్ధికంగా ఎంతో పడుతున్నట్లు మంత్రి పేర్ని నాని ఎదుట తమ గోడు వెళ్ళబోసుకున్నారు. విద్యుత్ బిల్లులపై కొందరు అనవసరపు అనుమానాలు పెంచి ప్రజలలో అనవసర గందరగోళం నెలకొల్పి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అన్నారు. శ్లాబుల ధరలు పెరిగాయని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. స్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్లు ప్రచారం సాగిస్తున్నారని వివరించారు.
విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని, మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు . మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ప్రజలకు ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం ఇస్తే అది కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారని వివరించారు. తన గృహంలో సైతం ఇటీవల విద్యుత్ వినియోగం అధికమయ్యిందని లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటంతో విద్యుత్ ఉపకరణాలను అత్యధికంగా ఉపయోగించడం వలెనే తమకు అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చేయని మంత్రి చెప్పారు.