ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు గవర్నర్ ఆమోదం..
హైదరాబాద్ మే 21
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.లాక్ డౌన్ సడలింపులతో తిరిగి ప్రజా జీవనం మొదలైంది. ఈ క్రమంలో తెలంగాణలో కొత్తగా 5 యూనివర్సిటీలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల స్థాపన కోసం 13 విద్యాసంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆమోదం ఉండటంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్భుల్లాపూర్ మండలం బహదూర్పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, మెదక్ జిల్లా సదాశివ్పేట మండల కంకోల్లో వోక్సెన్ యూనివర్సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దూలపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లో ఎస్ఆర్ యూనివర్సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి.