వర్షాకాలం తర్వాతే క్రికెట్ : బీసీసీఐ సీఈవో
హైదరాబాద్ మే 21
వర్షాకాలం తర్వాతే దేశంలో మళ్లీ క్రికెట్ టోర్నీలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్19 ఆంక్షల వల్ల క్రికెట్ టోర్నీలు అన్నీ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే వెబినార్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరూ తమ భద్రతను కోరుకుంటారని, వారిని గౌరవించాలని అన్నారు. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ అంశంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనున్నట్లు ఆయన తెలిపారు. వర్షాకాలం ముగిసాకే క్రికెట్ అధికారికంగా ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మన దగ్గర వర్షాకాలం ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడితే, అప్పుడు అక్టోబర్ లేదా నవంబర్‌లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఐపీఎల్‌లో ఆడేందుకు అంతర్జాతీయ ప్లేయర్లు వస్తుంటారని, వారికి 14 రోజుల క్వారెంటైన్ అవసరం ఉంటుందని, అలాంటి సందర్భంలో ఐపీఎల్ మ్యాచ్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించే కష్టమే అన్నారు.