అదనపు విద్యుత్ బిల్లులు అమానుషం
నగరంలో టిడిపి నాయకుల నిరసనలు
సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు మే 21
కరోనా కష్టకాలంలో నిరుపేద ప్రజలపై అదనపు విద్యుత్తు బిల్లుల భారం మోపడం సమంజసం కాదని, గురువారం నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో స్థానిక టిడిపి నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని వారందరికీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 రోజులుగా లాక్ డౌన్ పాటిస్తూ, కరోనా ప్రాణాంతక వైరస్ తో పోరాడుతూ , పనులు లేక , ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నందున నెల్లూరు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్లో, విద్యుత్ అదనపు విద్యుత్ బిల్లులను మోపడం సరికాదని ధ్వజ మెత్తారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి , నిరుపేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలను సవరించి, నూతన విద్యుత్ బిల్లులు మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డి, టిడిపి మహిళా అధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ అనుచరులు పట్టాభిరామిరెడ్డి తదితరులు ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు శిబిరాలకు వెళ్లి వారికి తన సంఘీభావాన్ని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భువనేశ్వర్ ప్రసాద్, పెంచల నాయుడు, టిడిపి మహిళా నాయకురాళ్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.