చిరు వ్యాపారిని దోచుకున్న జనం
న్యూఢిల్లీ, మే 22
ప్రతి సంక్షోభం మనిషికి రెండు దారులను చూపుతుంది. ఒక దారి మనిషిని మరింత రాటుదేల్చి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చి మందుకు నడిపితే.. మరొక దారి విలువలను తుంగలో తొక్కి మనుగడ కోసం ఎంతకైనా తెగించేలా చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడే మనలోని అసలు మనిషి బయటకొస్తాడని పెద్దలు చెబుతారు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్.. మనుషుల అసలు నైజాన్ని బయటపెడుతోంది. దోపిడీలు పెరుగుతాయేమోనని సమాజంలో చాలా మంది ఆందోళన చెందుతున్నట్లుగా దేశ రాజధానిఢిల్లీ నడిబొడ్డున దారుణ ఘటన చోటు చేసుకుంది. పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారి వద్ద దారిన పోయేవాళ్లు నిలువు దోపిడీ చేశారు.ఛోటే అనే వ్యక్తి ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు అమ్ముతుంటాడు. లాక్‌డౌన్‌తో అతడి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్ 4.0లో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే కాస్త గిరాకీ వస్తోంది. దీంతో రూ.30 వేల విలువైన సీజనల్ మామిడి పండ్లను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి జగత్‌పురి ప్రాంతంలోని ఓ పాఠశాల వద్ద విక్రయించడానికి తీసుకొచ్చాడు.పాఠశాల వద్ద పండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుండగా.. ఛోటేకు, అక్కడ ఓ దుకాణదారుడితో గొడవ జరిగింది. అతడికి సంబంధించిన నలుగురు వ్యక్తులు వచ్చి ఛోటేతో ఘర్షణకు దిగారు. వాళ్లు అలా గొడవ పడుతుండగా.. అటువైపు వెళ్తున్న ఓ వ్యక్తి ఇదే అదనుగా భావించి ఛోటే బండిపై ఉన్న మామిడి పండ్లను అందినకాడికి తీసుకొని వెళ్లాడు. అతడిని చూసి పదుల సంఖ్యలో జనం ఛోటే బండిపైకి ఎగబడ్డారు.చూస్తుండగానే ఛోటే పండ్ల బండి మొత్తం ఖాళీ అయ్యింది. దారెంట వెళ్తున్నవారు తమ వాహనాలు ఆపి అందినకాడికీ దోచుకెళ్లారు. దీంతో అక్కడ చిన్నపాటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొంత మంది మామిడి పండ్లను హెల్మెట్లలో పెట్టుకొని మరీ వెళ్లారు. ఛోటే తేరుకునే సరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది. ఖాళీ బండి చూసి అతడు లబోదిబోమంటున్నాడు.రూ.30 వేలు పెట్టి 15 పెట్టెల మామిడి పండ్లను కొనుగోలు చేశానని.. మొత్తం దోచుకెళ్లారని ఛోటే ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్‌తో 55 రోజులుగా కుదేలైన తనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని గోడు వెళ్లబోసుకున్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారి నుంచి సరైన స్పందన రాలేదని కంటతడి పెడుతున్నాడు.ఈ ఘటనను చూస్తుంటే.. ఆకలి రాజ్యం సినిమాలోని ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే.. బ్రదర్’ పాట గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు. అంతా బాగున్నప్పుడు విలువల గురించి చెప్పడం కాదు.. కష్టాలు ఎదురైనప్పుడు ఆ విలువలపై నిలబడి ఉన్నప్పుడే మనిషి జీవితానికి అర్థం ఉంటుంది. రోజూ నాలుగు పండ్లు అమ్ముకొని బతికే ఆ చిరు వ్యాపారిని నిలువునా ముంచి తీసుకొచ్చిన ఆ మామిడి పండ్లు మాత్రం వాళ్లకు ఏం రుచినిస్తాయి..?!