రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ
ముంబై, మే 22,
జర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును మరోసారి తగ్గించింది. 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో రెపో రేటు 4 శాతానికి దిగొచ్చింది. దీంతో రుణ రేట్లు మరింత దిగిరానున్నాయి. అంతేకాకుండా డిపాజిట్ రేట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది.ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీలోని ఐదుగిరిలో నలుగురు రెపో రేటు తగ్గింపునకు ఓటేశారు. రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో రివర్స్ రెపో కూడా 3.35 శాతానికి దిగొచ్చింది. ఇదివరకు రివర్స్ రెపో రేటు 3.75 శాతంగా ఉండేది.రిజర్వు బ్యాంక్ మార్చి 27న రెపో రేటు రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ మేర కోత విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్ డౌన్ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా అప్పుడు ఆర్‌బీఐ రుణాలపై 3 నెలల మారటోరియం కూడా విధించింది. అన్ని రకాల టర్మ్ లోన్స్‌కు ఇది వర్తిస్తుంది. మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం వర్తిస్తుంది.కాగా ఆర్‌బీఐ 3 నెలల ఈఎంఐ మారటోరియం ఆప్షన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా బ్యాంకులు వాటి కస్టమర్లకు ఈ ప్రయోజానాన్ని బదిలీ చేశాయి. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి పలు రకాల టర్మ్ లోన్స్ తీసుకున్న వారిలో చాలా మంది ఈ ఆప్షన్ వినియోగించుకున్నారు. క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా మారటోరియం వర్తిస్తుంది.