రాష్ట్రంలో 4లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న గోడౌన్లను నిర్మిస్తున్నాం.వాటిని త్వరితగతిన పూర్తిచేయాలి. రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. పంట ఉత్పత్తుల సేకరణకు గిడ్డంగుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు నీరు ప్రగతి, వ్యవసాయం పై అయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. నరేగా ద్వారా గ్రామాలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేస్తున్నాం. ఇదొక అరుదైన అవకాశం. ఈ రూపంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అయన అన్నారు. పశుగణాభివృద్ధి, ఆక్వా రంగాల్లో ఆదాయం మరింత పెరగాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ప్రయోజనం అందించాలని సూచించారు. తన రుణ మాఫీ కాలేదని ఒక్క రైతు కూడా భావించరాదన్నారు. లక్షా 62వేల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలను వేడుకగా నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించాలని... త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి మరింతగా పెరగాలన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. మన ఎంపీలు కేంద్రంపై పోరాడుతున్నారని... అదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేయాలని చంద్రబాబు అన్నారు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించాలని సీఎం సూచించారు. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో గరిష్టంగా నిధులు వినియోగించుకోవాలని, అధికార యంత్రాంగం ద్విముఖ వ్యూహంతో పనిచేయాలని తెలిపారు.